Suicides: గుజరాత్‌లో మూడేళ్లలో 25వేల మంది ఆత్మహత్య.. భాజపా వైఫల్యమేనని మండిపడ్డ కాంగ్రెస్‌

భాజపా పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడేళ్లలో 25వేల మంది ఆత్మహత్యల (Suicide)కు పాల్పడటం ఆందోళనకర విషయమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పేర్కొన్నారు.

Published : 02 Mar 2024 01:47 IST

దిల్లీ: భాజపా పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆత్మహత్యల (Suicide) రేటు అత్యధికంగా ఉండటం ఆందోళనకర అంశమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పేర్కొన్నారు. ఈసందర్భంగా కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సొంత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న దారుణ మానవ విషాదంపై ప్రధాని మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు.

‘అసెంబ్లీలో ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నివేదిక భయానక వాస్తవాలను చాటిచెబుతోంది. భాజపా హయాంలో గత మూడేళ్లలో 25వేల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో దాదాపు 500 మంది విద్యార్థులే. నిరాశ, నిస్పృహ, నిస్సహాయతలో కూరుకుపోయిన ప్రజల ముఖ చిత్రాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పురోగతి సాధిస్తోందంటూ ప్రకటించుకునే రాష్ట్రంలో ఎంతోమంది పౌరులు ఇలా బలవన్మరణాలకు పాల్పడుతుండటం ఆందోళనకర విషయం’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. డబుల్‌ ఇంజిన్ ప్రభుత్వం దుష్పరిపాలనకు ఇదో ఉదాహరణ అని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం, కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఇంతటి మానవ విషాదంపై ప్రధానమంత్రి మౌనం వహించడం దారుణమన్నారు.

ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వివిధ కారణాల వల్ల గత మూడేళ్లలో 25,478 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని, అందులో 495 మంది విద్యార్థులే ఉన్నట్లు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8,307 మంది, 2021-22లో 8,614 మంది, 2022-23లో 8,557 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సభలో వెల్లడించారు. అత్యధికంగా అహ్మదాబాద్‌ (3,280), సూరత్‌ (2,862), రాజ్‌కోట్‌ (1,287) వంటి నగరాల్లోనే ఈ కేసులు నమోదయ్యాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని