Karti Chidambaram: చైనీయులకు వీసాల జారీ కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్‌

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు పి. చిదంబరం కుమారుడు కార్తీకి దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

Published : 06 Jun 2024 13:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనీయులకు వీసాల కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరాని(Karti Chidambaram)కి ఊరట లభించింది. దిల్లీలోని రౌసు అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. 2011లో మొత్తం 263 మంది చైనీయులకు వీసాల జారీలో చోటు చేసుకొన్న అవకతవకల్లో జరిగిన మనీ లాండరింగ్‌లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పంజాబ్‌లో పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటునకు సంబంధించి చైనా వాసుల వీసా రీయూజ్‌ అప్రువల్‌ కోసం రూ. 50 లక్షలు లంచం స్వీకరించినట్లు ఆరోపణలున్నాయి. 

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్తీ చిదంబరంపై మార్చిలోనే ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. రూ.లక్ష విలువైన రెండు వ్యక్తిగత బాండ్లను సమర్పించాలని సూచించింది. నేడు లాంఛనాలను పూర్తి చేసి బెయిల్‌ తీసుకొన్నారు. ప్రతి వాయిదాకు కచ్చితంగా హాజరుకావాలని కోర్టు పేర్కొన్నారు. 

ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ దర్యాప్తునకు కచ్చితంగా హాజరుకావాలని సూచించింది. ఒక వేళ విదేశాల్లో ఉంటే దర్యాప్తు సంస్థ పిలిచిన 48 గంటల్లోపు హాజరుకావాలని గడవు విధించింది. దీంతోపాటు  దేశం విడిచి బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా న్యాయస్థానానికి పూర్తి సమాచారం అందజేస్తానని కార్తీ హామీని సమర్పించారు. 

ముంబయికి చెందిన బెల్‌ టూల్స్‌ సంస్థ పంజాబ్‌లో పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనాకు చెందిన షాంగ్‌డాంగ్‌ ఎలెక్ట్రిక్‌ పవర్‌ కన్‌స్ట్రక్షన్‌తో ఒప్పందం చేసుకొంది. దీంతో ఆ సంస్థ కొందరు చైనా ఉద్యోగులను ఈ ప్రాజెక్టు కోసం నియమించుకొంది. వీరికి సంబంధించిన వీసాల కోసం కన్సల్టెన్సీ ఫీజు రూపంలో మరో కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించింది. ఇది 263 మంది చైనా ఉద్యోగులకు వీసాల నిమిత్తం ఇచ్చిన సొమ్ముగా ఏజెన్సీ గుర్తించింది. దీనికి సంబంధించి సీబీఐ ఐదుగురిపై కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని