ఖాకీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా శునకాలకు ట్రైనింగ్‌.. తనిఖీల్లో పోలీసులకు భయానక అనుభవం

Dog Threat During Raids: మాదక ద్రవ్యాల అక్రమరవాణా జరుగుతోందన్న సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

Updated : 25 Sep 2023 17:58 IST

కొట్టాయం: అనుమానిత డ్రగ్‌ డీలర్(drug dealer) ఇంట్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన పోలీసుల(Kerala Cops)పై ఒక్కసారిగా శునకాలు దాడి చేశాయి. ఖాకీ దుస్తులు(Khaki) ధరించిన వారిని గాయపరిచేలా వాటికి శిక్షణ ఇచ్చినట్లు తెలుసుకొని వారు కంగుతిన్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. (Dog Threat During Raids)

మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో కేరళలోని కొట్టాయంలో ఓ వ్యక్తి ఇంట్లో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ బృందంలో ఘటనా స్థలానికి సమీపంలోని పోలీసు స్టేషన్‌కు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. సోదాల నిమిత్తం ఇంట్లోకి వెళ్లిన వారిపైకి ఒక్క సారిగా శునకాలు దూసుకెళ్లాయి. ‘అనుమానిత డ్రగ్‌ డీలర్ ఇంట్లో అన్ని కుక్కలు ఉంటాయని ఊహించలేదు. అవి హింసాత్మకంగా ప్రవర్తిస్తాయని అనుకోలేదు. దాంతో మేం సరిగా సోదాలు చేయలేకపోయాం’ అని కొట్టాయం ఎస్పీ వెల్లడించారు. అలాగే అధికారులు కుక్కల దాడి నుంచి తమను తాము రక్షించుకునే సమయంలో.. నిందితులు చక్కా జారుకున్నారని తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఏ ఒక్క అధికారి కూడా గాయపడలేదని ఎస్పీ తెలిపారు. అలాగే ఘటనా స్థలం నుంచి 17 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  అంతేగాకుండా నిందితుడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

యూపీ విద్యార్థిపై చెంపదెబ్బల ఘటన.. మీ మనస్సాక్షిని కదిలించాలి: సుప్రీంకోర్టు

‘ప్రాథమిక సమాచారం మేరకు.. నిందితుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడు ఒక డాగ్ ట్రైనర్‌గా చెలామణీ అవుతున్నాడు.  ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా కుక్కలకు ట్రైనింగ్‌ ఇచ్చాడు. అంతకుముందు శునకాలను అదుపు చేయడం ఎలా..? వంటి విషయాల గురించి విశ్రాంత బీఎస్‌ఎఫ్ అధికారి వద్ద శిక్షణ పొందాడు. అయితే ప్రత్యేకంగా ఖాకీ దుస్తులు ధరించిన వారిని గాయపరచడం గురించి ప్రశ్నలు అడగడంతో అతడిని గెంటేశారు. కానీ ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో డాగ్‌ ట్రైనర్‌గా అందరికీ పరిచయం కావడంతో.. ఆ ప్రాంతవాసులు అతడింట్లో తమ శునకాలను వదిలివెళ్లేవారు. అందుకోసం ఒక్కో శునకానికి రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు’ అని ఎస్పీ తెలిపారు.

అలాగే ఘటన సమయంలో అతడి వద్ద 13 శునకాలు ఉన్నాయని, వాటిని యజమానులకు అప్పగించామని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ డ్రగ్‌ రాకెట్ వెనుక ఎవరెవరు ఉన్నారో గుర్తించనున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని