Viral news: వృద్ధుడని కూడా కనికరించలేదు.. చితకబాదిన పోలీసులు!

రోడ్డుపై సైకిల్‌ తొక్కుకుంటూ పడిపోయిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 22 Jan 2023 01:13 IST

పట్నా: ఆయనో ఉపాధ్యాయుడు (Teacher). దాదాపు 70 ఏళ్లు ఉంటాయి. 40 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులను (Students) తీర్చిదిద్దారు. అంతటి గౌరవం కలిగిన వ్యక్తి.. రోడ్డుపై సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తూ జారి పడితే... సాయం చేయాల్సిన పోలీసులు (Police) లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ అమానవీయ ఘటన బిహార్‌ (Bihar)లోని కైమూర్‌లో చోటు చేసుకుంది. నవల్‌ కిశోర్‌ పాండే అనే ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. క్లాసు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తుండగా రద్దీగా ఉండే భభువా ప్రాంతంలో సైకిల్‌తోపాటు కింద పడిపోయారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈలోగా అక్కడికి చేరుకున్న ఇద్దరు మహిళా పోలీసులు హారన్‌ మోగిస్తూ సైకిల్‌ పక్కకి తీయాలని కోరారు. కానీ, వృద్ధుడైన ఉపాధ్యాయుడు వెంటనే తీయలేకపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన పోలీసులు విచక్షణారహితంగా అతడిపై దాడికి దిగారు. వీపు, చేతులపై లాఠీలతో చితకబాదారు. వదిలేయమని వేడుకుంటున్నా వినకుండా దుర్భాషలాడుతూ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాండే ప్రతిరోజూ ఇదే మార్గంలో సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుంటారని అక్కడివారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని