Drone: శత్రు డ్రోన్లను చీల్చి చెండాడతాయ్‌!

జమ్ములోని భారత వాయుసేన స్థావరంపై  డ్రోన్ల దాడితో దేశం ఉలిక్కిపడింది. తాజా ఘటన శత్రువుల నుంచి ఈ విధంగానూ ముప్పు పొంచి ఉందని చెప్పకనే చెబుతోంది. ఇలాంటి తరహా దాడి జరగడం భారత్‌లో ఇదే తొలిసారి కావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి...

Published : 30 Jun 2021 14:10 IST

జమ్మూలోని భారత వాయుసేన స్థావరంపై  డ్రోన్ల దాడితో దేశం ఉలిక్కిపడింది. తాజా ఘటన శత్రువుల నుంచి ఈ విధంగానూ ముప్పు పొంచి ఉందని చెప్పకనే చెబుతోంది. ఇలాంటి తరహా దాడి జరగడం భారత్‌లో ఇదే తొలిసారి కావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్‌లను గుర్తించి వాటిని కూల్చివేసే యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ కోసం భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే విదేశాల్లో ఇలాంటి పరిజ్ఞానం ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనివల్ల లాభాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిని బేరీజు వేసుకొని, కొన్ని మార్పులు చేస్తే డ్రోన్లను ఎదుర్కొనే సాంకేతికతని భారత్‌ సులభంగా అభివృద్ధి చేసుకోగలదు.

శత్రు డ్రోన్‌ నుంచి ముప్పు తప్పించుకోవాలంటే ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. 1. డ్రోన్‌ను గుర్తించి దానిని స్వాధీనం చేసుకోవడం 2. కీలక ప్రాంతాల్లోకి  డ్రోన్లు ప్రవేశించకుండా నియంత్రించడం. డ్రోన్‌ను గుర్తించడానికి డ్రోన్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ వాడితే.. వాటిని నాశనం చేయడానికి కౌంటర్‌ డ్రోన్‌ విధానాన్ని వాడతారు. ప్రధానంగా నాలుగు రకాల డ్రోన్‌ మానిటరింగ్‌ పరికరాలు ఉన్నాయి. 1. రేడియో ఫ్రీక్వెన్సీ అనలైజర్స్‌ 2. మైక్రోఫోన్లు 3.ఆప్టికల్‌ సెన్సార్లు ( కెమెరాలు) 4. రాడార్లు

రేడియో ఫ్రీక్వెన్సీ అనలైజర్లు

రేడియో ఫ్రీక్వెన్సీ అనలైజర్లకు రెండు మూడు యాంటెన్నా లాంటి నిర్మాణాలుంటాయి. వాటి పరిధిలోని రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఇవి విశ్లేషిస్తాయి. స్పెక్ట్రమ్‌ పరిధిలోకి డ్రోన్‌ వచ్చినట్లయితే.. డ్రోన్‌, దానిని నియంత్రిస్తున్న వారి మధ్య సంభాషణను ఇవి గుర్తించి రికార్డు చేస్తాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో వీటిని మోహరిస్తే నష్టాన్ని ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. స్పెక్ట్రమ్‌ పరిధిలోకి ఎన్ని డ్రోన్లు వచ్చినా వాటి మధ్య సంభాషణను రికార్డు చేయగలవు. అయితే అవి స్పెక్ట్రమ్‌లో ఎక్కడున్నాయన్నది మాత్రం చెప్పలేవు. వాటంతట అవే నిర్ణయాలు తీసుకునే (అటానమస్‌) డ్రోన్లను మాత్రం ఇవి గుర్తించ లేవు. అంతేకాకుండా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌ పరధి చాలా తక్కువగా ఉంటుంది.

మైక్రో ఫోన్లు

నిర్దిష్ట ప్రాంతంలో వీటిని అమర్చినట్లయితే డ్రోన్‌ శబ్దాన్ని గుర్తించి, అది ఏ దిశలో ప్రయాణం చేస్తుందో చెప్పగలుగుతాయి. వీటి ద్వారా అటానమస్‌ డ్రోన్‌లను కూడా గుర్తించవచ్చు. సిగ్నళ్లు రాని మారుమూల ప్రాంతాల్లోనూ వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే శబ్దాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటి ద్వారా డ్రోన్లను గుర్తించడం దాదాపు అసాధ్యం. అత్యధికంగా 300-500 మీటర్ల పరిధిలోపే వీటి ప్రభావం ఉంటుంది. అంతకంటే దూరంగా ఉన్న డ్రోన్లను గుర్తించలేవు.

ఆప్టికల్‌ సెన్సార్లు

ఆప్టికల్‌ సెన్సార్లంటే ఇంకేం కాదు.. హై రెజిల్యూషన్‌ కెమెరాలే. సమస్యాత్మక ప్రాంతంలో అక్కడక్కడా వీటిని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వీడియోలను రికార్డు చేస్తారు. వీటిని మానిటర్‌ చేసినట్లయితే అనుమతి లేకుండా సంచరిస్తున్న డ్రోన్లను సులభంగా గుర్తుపట్టవచ్చు. నిర్ణీత పరిధిలో ఎన్ని డ్రోన్లనైనా గుర్తించవచ్చు. డ్రోన్‌కు సంబంధించిన వీడియోను, అది ఎక్కడ సంచరిస్తోందన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఒక వేళ ఆ  ప్రాంతంలో ఎక్కువ డ్రోన్లు సంచరిస్తుంటే అందులో శత్రువు డ్రోన్ ఏదో గుర్తించడం కష్టమవుతుంది. అంతేకాకుండా చీకటి ప్రాంతాల్లో ఇవి కచ్చితమైన ఫలితాలను ఇవ్వలేవు.

రాడార్

రేడియో తరంగాల ద్వారా ఓ వస్తువును గుర్తించేందుకు రాడార్‌ వాడతారు. రాడార్‌ నుంచి వెలువడిన రేడియో తరంగాలు.. అవతలి వస్తువును తాకి పరావర్తనం చెందుతాయి. వీటిని విశ్లేషించడం ద్వారా ఆ వస్తువు ఎంత దూరంలో ఉంది? ఏ దిశలో పయనిస్తుందో తెలుసుకునే వీలుంటుంది. రాడార్‌ పరిధి ఎక్కువగా ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో అవతలి వస్తువు గమనాన్ని, స్థితిని చెప్పగలుగుతాయి. ఎన్ని వస్తువులనైనా ఒకే సారి గుర్తించగలిగే సామర్థ్యముంటుంది. అయితే రాడార్లు పెద్ద వస్తువులను మాత్రమే గుర్తించగలవు. రాడార్‌లో డ్రోన్లను గుర్తించే సాంకేతికను ఇనుమడింప జేస్తే.. గాల్లో ఎగిరే పక్షులను కూడా డ్రోన్లుగానే భావించి అలర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా దీని నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. తరంగ పౌనఃపున్యాన్ని పెంచితే పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది.

ఇలాంటి సాధనాల వల్ల డ్రోన్లను గుర్తించి, ముప్పును ముందుగానే గ్రహించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ, సరైన సమయంలో వాటిని నియంత్రించలేకపోతే అపార నష్టం కలిగే ప్రమాదముంది. దీనికోసం తీసుకొచ్చినవే డ్రోన్‌ కౌంటర్‌ మెజర్స్‌ ఎక్విప్‌మెంట్స్‌. వీటి ద్వారా శత్రు డ్రోన్‌లను తిప్పికొట్టే వీలుంటుంది. మూడు రకాలుగా డ్రోన్‌పై దాడి చేయవచ్చు.1. ఎదురుదాడి చేసి నాశనం చేయడం 2. పని చేయకుండా చేయడం 3. డ్రోన్‌ను అధీనంలోకి తెచ్చుకోవడం.

రేడియో ఫ్రీక్వెన్సీ జామర్లు

ఈ పరికరం ద్వారా అధిక మొత్తంలో రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను శత్రు డ్రోన్‌ మీదికి పంపిస్తారు. దీంతో దాని సామర్థ్యం దెబ్బతిని అక్కడికక్కడే నెమ్మదిగా దిగిపోవచ్చు. లేదంటే కుప్పకూలిపోవచ్చు. ఎక్కడి నుంచి దానిని ప్రయోగించారో తిరిగి అక్కడికే వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి వేరే దిశలో వెళ్లిపోయే ప్రమాదమూ ఉంది. అయితే ఇవన్నీ డ్రోన్‌లో ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. డ్రోన్లు సమీపంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ జామర్లను ఉపయోగించే వీలుంది. దూరంలో ఉన్న డ్రోన్లను వీటి ద్వారా నియంత్రించలేము.

జీపీఎస్‌ స్పూఫర్లు

ఇది ఓ ప్రత్యేకమైన పరికరం. డ్రోన్‌కు అందుతున్న సంకేతాలను స్పూఫ్‌ చేసి (అనుకరించి) అదే రకమైన సంకేతాలను పంపించి డ్రోన్‌ను బోల్తా కొట్టిస్తుంది. జీపీఎస్‌ స్పూఫర్‌ పంపిన సంకేతాలు శాటిలైట్‌తో ముడిపడి ఉంటాయి. దీంతో డ్రోన్‌ ఎక్కడుందో సులువుగా కనిపెట్టేయొచ్చు. అంతేకాకుండా డ్రోన్‌ నియంత్రణను అధీనంలోకి తెచ్చుకునే వీలుంటుంది. ఇది కూడా తక్కువ పరిధిలో మాత్రమే పని చేస్తుంది. అయితే, దీనివల్ల ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థలు కూడా ప్రభావితమవుతాయి.

హై పవర్‌ మైక్రోవేవ్‌ (హెచ్‌పీఎం) 

హైపవర్‌ మైక్రోవేవ్‌ పరికరం బలమైన విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. వీటికి ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లోని సర్క్యూట్‌లను నాశనం చేసేంత శక్తి ఉంటుంది. ఈ పరికరం చేరువలోకి డ్రోన్లు వస్తే, అందులోని సర్క్యూట్లు దెబ్బతిని డ్రోన్‌ కూలిపోతుంది. విద్యుదయస్కాంత తరంగాలను అవసరమైన దిశలో పంపించేందుకు వీలుగా దీనికి యాంటెన్నా లాంటి నిర్మాణం ఉంటుంది. హెచ్‌పీఎం ధర చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిర్వహణ భారమూ అధికమే. హెచ్‌పీఎం నుంచి విడుదలైన తరంగాల వల్ల దగ్గర్లోని ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా దెబ్బతినే ప్రమాదముంది.

గద్దలే ఓ పెద్ద సైన్యం

వేల సంవత్సరాల క్రితం నుంచి పక్షులను రకరకాలుగా వినియోగించుకుంటున్నాం. ప్రస్తుతం డ్రోన్లపై యుద్ధానికి కూడా వాటిని ఉపయోగించుకునే వీలు లేకపోలేదు. డ్రోన్లను గుర్తించేలా గద్దలకు తర్ఫీదు ఇస్తారు. ఆయా ప్రాంతాల్లో శత్రు డ్రోన్‌లు కనిపిస్తే, అవి వాటిపై దాడి చేస్తాయి. దీనికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అక్కర్లేదు. అయితే గద్దలకు తర్ఫీదు ఇచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా అన్నిసార్లూ కచ్చితమైన ఫలితం రాకపోవచ్చు.

వల గన్‌లు

మన భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌ను గుర్తించినా.. అది మన అధీనంలోకి రానప్పుడు దానిపైకి వల విసిరి పట్టుకోవచ్చు. దీని కోసం ప్రత్యేక గన్నులు కూడా అందుబాటులో ఉన్నాయి. నేల పైనుంచి ప్రయోగించి 20 నుంచి 300 మీటర్ల ఎత్తులో ఉన్న డ్రోన్లను బంధించవచ్చు. అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు శత్రు డ్రోన్‌కు సమాంతరంగా మరో డ్రోన్‌ను పంపంచి అక్కడి నుంచి వల వేయవచ్చు.

 శక్తిమంతమైన లేజర్లు

శత్రు డ్రోన్లపైకి బలమైన లేజర్‌ కిరణాలను పంపించి అందులోని సర్క్యూట్‌లను నాశనం చేయవచ్చు. ఫలితంగా అది నియంత్రణ కోల్పోయి కూలిపోతుంది. అయితే ఈ లేజర్‌ టెక్నాలజీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ప్రమాదవశాత్తూ జనావాసాల్లో డ్రోన్‌ కూలిపోతే అపార నష్టం వాటిల్లే ప్రమాదముంది.

అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీలను ఉపయోగించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా డ్రోన్లను ఎదుర్కోవడం కాస్త కష్టమే. కానీ, రెండు మూడు టెక్నాలజీలను ఉపయోగించి పోరాడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. అయితే ఏ రెండింటినీ మిళితం చేయాలన్నది.. ఆయా పరిస్థితులు, అక్కడి అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని