Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సంజయ్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం కోసం మార్చి 19న తిహాడ్‌ జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.

Published : 18 Mar 2024 16:53 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు (Money laundering) సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్‌.. ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయనను ప్రమాణస్వీకారం కోసం మార్చి 19న తిహాడ్‌ జైలు నుంచి పార్లమెంటుకు (Parliament) తీసుకెళ్లాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. ఇందుకు అవసరమైన భద్రత కల్పించాలని జైలు అధికారులకు సూచించింది.

‘‘రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం కోసం 19-03-2023న నిందితుడిని పార్లమెంటుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయండి. అది పూర్తైన తర్వాత జైలుకు సురక్షితంగా తీసుకురండి’ అని తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌కు ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో సంజయ్‌సింగ్‌ మొబైల్‌ వాడకుండా చూడటంతో పాటు ఇతర నిందితులు, సాక్షులు, మీడియాతోనూ సంభాషించకుండా చూడాలని అందులో పేర్కొన్నారు. కేవలం అతడి న్యాయవాది, కుటుంబసభ్యులతో మాత్రమే మాట్లాడేందుకు అనుమతిచ్చారు.

ఇదిలాఉంటే, ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది జనవరి 27తో ముగిసింది. ఈ క్రమంలోనే సంజయ్‌ని ఆమ్‌ఆద్మీ పార్టీ రెండోసారి ఎంపీగా నామినేట్‌ చేసింది. అయితే, దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన సీబీఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తోన్న ఈడీ.. సంజయ్‌సింగ్‌ను గతేడాది అక్టోబర్‌ 4న అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని