Supreme Court: పథకాలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించలేవు: సుప్రీంకోర్టు

ప్రభుత్వాల విధాన పరమైన అంశాలను పరిశీలించడంలో న్యాయస్థానాల పరిధి పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Published : 23 Feb 2024 17:08 IST

దిల్లీ: ప్రభుత్వాల విధాన పరమైన అంశాలను పరిశీలించడంలో న్యాయస్థానాల పరిధి పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. చిన్నారులు ఆకలి, పోషకాహార లోపాన్ని(malnutrition) ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌(community kitchens)ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్న సందర్భంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA),  ఇతర సంక్షేమ పథకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయని ఈ విషయంలో న్యాయస్థానాలు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవని పేర్కొంది. ప్రభుత్వాలకు పథకాలను రూపొందించే అర్హత ఉంటుంది. సంక్షేమ పథకాల విషయంలో పాలనా యంత్రాంగానికి న్యాయస్థానాలు సలహాదారులు కాదు. ‘‘మెరుగైన ప్రత్యామ్నాయం ఉందనే కారణంతో ఏదైనా విధానం లేదా పథకాన్ని అమలుచేయమని న్యాయస్థానాలు రాష్ట్రాలను ఆదేశించలేవు.’’ అని బెంచ్‌ పేర్కొంది. వీటి అమలు గురించి నిర్ణయించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌ల కోసం ఒక పథకాన్ని రూపొందించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ పిల్‌ దాఖలు చేశారు. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కుతో సహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని