Atiq Ahmad: నేరస్థులను కఠినంగా శిక్షించాల్సిందే, కానీ.. అతీక్‌ అహ్మద్‌ ఘటనపై కాంగ్రెస్‌

రాజకీయ నేతగా ఎదిగిన  ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (60), అతడి సోదరుడు అష్రాఫ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపారు. ఈ ఘటన  నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated : 16 Apr 2023 14:30 IST

దిల్లీ: నేరస్థులను కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. కానీ, అది చట్టానికి లోబడే జరగాలని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని అతిక్రమించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అభిప్రాయపడింది. రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (60), అతడి సోదరుడు అష్రాఫ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 10 ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపిన నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే, ఎక్కడా అతీక్‌ పేరుగానీ, కాల్పులకు సంబంధించిన ఉదంతాన్ని గానీ కాంగ్రెస్‌ పార్టీ తమ ప్రకటనలో ప్రస్తావించలేదు.

రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలే అత్యున్నతమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని.. అలాగే అలాంటి వారికి రక్షణ కల్పించే వారిని కూడా బాధ్యుల్ని చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో చట్టం, న్యాయానికి సముచిత గౌరవం దక్కేలా ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ మరో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం ట్వీట్‌ చేశారు.

అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఒక వైద్య కళాశాల వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అతీక్‌ అహ్మద్‌ సమాజ్‌వాదీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారు. వైద్య పరీక్షల కోసం అతీక్‌, అష్రాఫ్‌లను తరలిస్తుండగా మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్నలడిగారు. ఆ సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్చారు. మొదట అతీక్‌ కణతపై పెట్టి ఒక వ్యక్తి కాల్పులు జరపగా ఆ తర్వాత కింద పడ్డాక వారిద్దరిపై కాల్పులు కొనసాగాయి. ఈ దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. కాల్పుల ఘటనకు కారకులుగా భావిస్తూ ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని