18th Lok Sabha: ఎనిమిదోసారి.. లోక్‌సభలో ‘సీనియర్‌ మోస్ట్‌’ ఎంపీలు!

ఇంద్రజిత్‌ గుప్తా, వాజ్‌పేయీ, కమల్‌నాథ్‌ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

Published : 06 Jun 2024 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంటులో అడుగుపెట్టి.. లక్షల మంది తరఫున తమ గళాన్ని వినిపించే అవకాశం కొందరికే దక్కుతుంది. ఈ క్రమంలోనే తమ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొంటూ.. దశాబ్దాల పాటు లోక్‌సభకు ఎన్నికవుతోన్న నాయకులు ఎందరో ఉన్నారు. ఇంద్రజిత్‌ గుప్తా, వాజ్‌పేయీ, కమల్‌నాథ్‌ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ వంటి నేతలు దశాబ్దాల పాటు చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈనేపథ్యంలో 18వ లోక్‌సభలోనూ అడుగుపెడుతోన్న అత్యంత సీనియర్ల జాబితాను పరిశీలిస్తే..

డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌.. భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్‌ లోక్‌సభలో అత్యంత సీనియర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. 1996లో తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన.. వరుసగా ఎనిమిది సార్లు ఎంపీగా విజయం సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. 2019 ప్రొటెం స్పీకర్‌గా చేశారు. దళిత నేతల్లో ఒకరిగా ఉన్నారు. మోదీ కేబినెట్‌లో కేంద్ర సామాజిక న్యాయమంత్రిగా వ్యవహరించారు.

సురేష్‌ కొడికున్నిల్‌.. కేరళలో కాంగ్రెస్‌ దిగ్గజ నేతల్లో ఒకరు. మావెళిక్కర పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎల్‌ఎల్‌బీలో పట్టా పొందిన ఆయన.. విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేశారు. 27 ఏళ్ల వయసులోనే 1989లో అదూర్‌ నుంచి పోటీ చేసి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత మవెళిక్కర నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. తాజాగా ఎనిమిదోసారి గెలుపొందిన ఆయన 18వ లోక్‌సభలో అత్యంత సీనియర్లలో ఒకరిగా నిలిచారు.

  • భాజపా నేతలు పంకజ్‌ చౌధరి (మహారాజ్‌గంజ్‌), జిగజినాగి రమేష్‌ చందప్పా (బీజాపుర్‌), ఫాగన్‌ సింగ్‌ (మాల్దా), రాధా మోహన్‌ సింగ్‌ (పుర్వి చంపారన్‌), మన్‌సుఖ్‌భాయ్‌ ధాంజీభాయ్‌ (భరూచ్‌)తోపాటు డీఎంకే నేత టీఆర్‌ బాలు (శ్రీపెరంబదూర్‌)లు లోక్‌సభకు ఏడుసార్లు ఎన్నికైన నేతల జాబితాలో ఉన్నారు.
  • భాజపా నేతలు ఇంద్రజిత్‌ సింగ్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బంధోపాధ్యాయలు ఆరోసారి విజయం సాధించారు. హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఐదోసారి గెలుపొందారు. శిరోమణి అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌లు నాలుగోసారి ఎన్నికైనవారిలో ఉన్నారు. వీరితోపాటు అనేక మంది ఎంపీలు ఆరు, ఐదు, నాలుగు మూడుసార్లు విజయం సాధించిన వారిలో ఉన్నారు.
  • 17వ లోక్‌సభలో అత్యంత సీనియర్‌ నేతలుగా ఉన్న మేనకా గాంధీ, సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ (75)లు ఎనిమిది సార్లు ఎంపీలుగా గెలుపొందారు. తాజా లోక్‌సభ ఎన్నికలకు సంతోష్‌ కుమార్‌ దూరంగా ఉండగా.. మేనకా గాంధీ ఓడిపోయారు.

గుప్తాదే రికార్డు..

  • అంతకుముందు అనేకమంది దిగ్గజ నేతలు అనేకమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి చరిత్ర సృష్టించారు. ఇంద్రజిత్ గుప్తా.. లోక్‌సభకు 11 సార్లు గెలుపొందిన రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదు. సీపీఐకు చెందిన ఆయన 1960 నుంచి 2001 వరకు (1977లో మినహా) పశ్చిమబెంగాల్‌లో వివిధ లోక్‌సభ స్థానాల నుంచి 11 సార్లు ఎంపీగా గెలుపొందారు.
  • భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ.. మొత్తం 10 సార్లు ఎంపీగా గెలుపొందారు. బలరాంపుర్‌, గ్వాలియర్‌, దిల్లీ నుంచి ఎంపీగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత ఐదు పర్యాయాలు (1991-2009) లఖ్‌నవూ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
  • యూపీఏ-1 ప్రభుత్వ సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన సోమనాథ్‌ ఛటర్జీ.. పదిసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నేత పీఎం సయీద్‌ కూడా పదిసార్లు వరుసగా ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1967లో లక్షద్వీప్‌ లోక్‌సభ స్థానం ఏర్పాటైనప్పటినుంచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2005లో గుండెపోటుతో మరణించారు.
  • కాంగ్రెస్‌ దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ఉన్న కమల్‌నాథ్‌.. తన కంచుకోటగా ఉన్న ఛింద్వాడా లోక్‌సభ స్థానం నుంచి తొమ్మిదిసార్లు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. సమతా పార్టీ వ్యవస్థాపకుడు జార్జ్‌ ఫెర్నాండెజ్‌.. ఎనిమిది సార్లు గెలుపొందిన వారిలో ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని