ర్యాట్‌హోల్‌ మైనర్‌ ఇల్లు కూల్చివేత వివాదం... అధికారుల ప్రతిపాదనకు ‘నో’

దిల్లీలో జరిగిన కూల్చివేత డ్రైవ్‌లో ఉత్తర్‌కాశీలోని సిల్‌క్యారా సొరంగం (Silkyara Tunnel) వద్ద నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన ఒక ర్యాట్‌హోల్ మైనర్‌ ఇల్లు కూడా కూలిపోయింది.

Published : 29 Feb 2024 21:42 IST

దిల్లీ: అక్రమ కట్టడాల కూల్చివేత కోసం దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(DDA) చేపట్టిన డ్రైవ్‌లో ర్యాట్‌హోల్‌ మైనర్(rat-hole miner) వకీల్ హసన్‌ ఇల్లు కూడా ఉంది. బుధవారం ఖాజూరీ ఖాస్ ప్రాంతంలో డీడీఏ తీసుకున్న చర్యల్లో భాగంగా అతడి ఇల్లు కూడా కూలిపోయింది.

గత ఏడాది ఉత్తర్‌కాశీలోని సిల్‌క్యారా సొరంగం (Silkyara Tunnel)లో చిక్కుకుపోయిన కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ‘ర్యాట్‌ హోల్‌ మైనర్ల (Rat-hole Miners)’ది కీలక పాత్ర. అత్యంత ప్రమాదకరమైన ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను రెస్క్యూ బృందాలు రక్షించగలిగిన సంగతి తెలిసిందే. ఆ మైనర్లలో హసన్ ఒకరు. అయితే, అభివృద్ధి పనులకు కేటాయించిన స్థలంలోని అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఫిబ్రవరి 28న డ్రైవ్ చేపట్టినట్లు డీడీఏ ఓ ప్రకటన విడుదల చేసింది.

తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిని ఎలా కూల్చివేశారంటూ హసన్‌ ఆరోపించారు. దాంతో తాము రాత్రంతా ఆరుబయటే ఉండాల్సి వచ్చిందని వాపోయారు. ఈ విషయం వెలుగులోకి రాగానే డీడీఏ స్పందించింది. ‘విధుల్లో భాగంగానే ఈ డ్రైవ్‌ చేపట్టామని, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని అన్నారు. ఆ ఇల్లు ఆక్రమిత స్థలంలో ఉందని హసన్‌కు కూడా తెలుసు. ఎవరినీ లక్ష్యంగా చేసుకొని దీనిని నిర్వహించలేదు’ అని డీడీఏ స్పష్టం చేసింది 

రెస్క్యూ ఆపరేషన్‌లో ఆయన పాత్ర గురించి తెలియగానే ఆయన్ను సంప్రదించామని, తాత్కాలిక వసతి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే దీనిని హసన్ తిరస్కరిస్తూ తనకు శాశ్వత వసతి కల్పించాలని కోరారు. ‘వారు గోవింద్‌పురి ప్రాంతంలో ఇల్లు ఇస్తామని చెప్పారు. మౌఖికంగా చెప్పడంతో నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను’ అని తెలిపారు. ఇదిలాఉంటే తాము ఇప్పటికీ హసన్‌ కుటుంబానికి సహాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని డీడీఏ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని