Tragedy: ‘ఈ పీడకల కన్నా చావడమే మేలు..’ శిమ్లాలో బాధితుల కన్నీటి వేదన!

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా చోటుచేసుకుంటున్న ఘటనలు విషాదం రేపుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో అక్కడి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Published : 26 Aug 2023 02:12 IST

(ఇటీవల కులూలో పేకమేడల్లా కుప్పకూలిన ఇళ్లు- ఫైల్‌ ఫొటో)

శిమ్లా: ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలు(Heavy Rains), భారీ కొండచరియలు (Landslides) విరిగిపడుతున్న ఘటనలతో హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh) విలవిల్లాడుతోంది. కొండచరియలు విరిగిపడి పలుచోట్ల భారీ పేకమేడల్లా కుప్పకూలుతోన్న భవంతుల దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడిన ఘటన తమకు పీడకలగా మారిందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఎక్కడకు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి కన్నా చావడమే మేలనిపిస్తోందంటూ ప్రొమిలా అనే మహిళ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు.

‘‘ఆగస్టు 23న కొండచరియలు విరిగిపడటంతో మేం ఉండే భవనం ధ్వంసమైంది. నేను మా అమ్మ(75 ఏళ్లు)తో కలిసి ఉంటున్నా. ఆమె క్యాన్సర్‌ బారిన పడి 2016 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల భారీ వర్షాలకు నా ఉద్యోగం సైతం పోయింది. ఓ దుకాణంలో సేల్స్‌ గర్ల్‌గా పనిచేసేదాన్ని. వర్షాల కారణంగా కస్టమర్లు రాకపోవడంతో దుకాణం మూసివేశారు. ఇల్లు కూలిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదు. గురువారం రాత్రి నేను మా అమ్మ చికిత్సపొందుతున్న ఆస్పత్రిలోనే నిద్రపోవాల్సి వచ్చింది’’ అని ప్రొమిలా ఆవేదన వ్యక్తంచేశారు. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న సదరు మహిళ తనకు తండ్రి గానీ, తోబుట్టువులు గానీ లేరని.. తనకు ఉన్నదల్లా అమ్మ మాత్రమేన్నారు. ఉద్యోగం కోసం  తీవ్రంగా వెతుకుతున్నానని.. తన తల్లి చికిత్స కోసం చాలా డబ్బు అవసరం ఉన్నందున క్లీనింగ్‌ పనిచేసేందుకైనా సిద్ధంగానే ఉన్నానంటూ కన్నీటి గాథను చెప్పుకొచ్చారు. 

భవనం కూలినప్పుడు భయంతో బయటకు పరుగులు తీయడంతో కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని సుమన్‌ అనే మరో మహిళ విలపించారు. తాను ఇళ్లలో పనిచేస్తుంటానని..  తన కొడుకు స్కూల్‌ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానన్నారు. తమకు ఆశ్రయం లేదని.. బట్టలు కూడా పోయాయంటూ వాపోయారు. ఐదో తరగతి చదువుతున్న తన కుమారుడి పుస్తకాలు సైతం పోయాయంటూ ఆవేదన చెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారుల దృష్టి ఈ ప్రాంతం పడలేదని.. అందువల్ల తమ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలిపారు. గురుద్వారాలో ఆహారం తింటున్నామని.. తమ బంధువుల ఇంటి నుంచే తిరుగుతున్నట్టు చెప్పారు. కానీ తమకు ఎలాంటి సాయంగానీ, తక్షణ ఉపశమనం గానీ లభించలేదన్నారు. శిమ్లాలో భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఘటనలతో జూన్‌ 24 నుంచి ఆగస్టు 24వరకు 242మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు ₹10వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని