India-US: అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్‌ సీరియస్‌

India-US: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది.

Published : 25 Apr 2024 19:01 IST

దిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో జాతుల మధ్య ఘర్షణల అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు (human rights violations) చోటుచేసుకున్నాయని ఇటీవల అమెరికా (USA) ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. అది పూర్తిగా పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టంచేసింది.

గురువారం నాటి మీడియా సమావేశంలో విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఆ నివేదిక పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నది. భారత్‌ (India)ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దీంతో అర్థమవుతోంది. దీనికి మేం ఎలాంటి విలువ ఇవ్వడం లేదు. మీరు కూడా ఇవ్వొద్దు’’ అని వ్యాఖ్యానించారు.

2023లో మానవ హక్కుల విధానాలపై అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో మణిపుర్‌ అల్లర్ల అంశాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. నాటి ఘటనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిగ్గుచేటని అభివర్ణించారని, చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపింది.

దీంతోపాటు, బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ)పై ఆదాయపు పన్ను దాడులు, గుజరాత్‌ న్యాయస్థానం రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్నీ నివేదికలో ప్రస్తావించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ నివేదికను విడుదల చేశారు. మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలను సైతం ఇందులో పేర్కొన్నారు.

అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్‌ కీలక ప్రతిపాదన!

ఇక, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు భారత్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌పైనా అమెరికా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం తమను ఆందోళనకు గురిచేస్తోందని, సీఏఏ అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. ‘‘మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రం’’ అని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా భారత్‌ దీటుగా స్పందించింది. భారత బహుళ సంస్కృతులు, దేశ విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు అనవసర ఉపన్యాసాలు ఇవ్వొద్దని గట్టిగా చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని