Israel Hamas war: అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్‌ కీలక ప్రతిపాదన!

హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం విషయంలో హమాస్‌ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు.

Published : 25 Apr 2024 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి (Israel- Hamas War) దాదాపు ఏడు నెలలవుతోంది. ఇప్పటికీ అనేకమంది బందీలు ఉగ్ర చెరలోనే ఉన్నారు. మరోవైపు టెల్‌అవీవ్‌ భీకర దాడులు.. గాజాను మరుభూమిగా మారుస్తున్నాయి. ఇప్పటికే 34 వేల మందికి పైగా మృతి చెందారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారాయి. ఈ పరిణామాల నడుమ హమాస్‌ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు.     అదేవిధంగా ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌’లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు.

ఏమిటీ ద్విదేశ పరిష్కారం!

‘‘హమాస్‌ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్‌ విజయం సాధించలేదు. ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే దెబ్బతీయగలిగింది. యుద్ధం ముగుస్తుందని మాకు హామీ ఇవ్వకపోతే.. బందీలను ఎందుకు విడుదల చేస్తాం? ఒకవేళ హమాస్‌ను అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి? కాబట్టి.. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమం’’ అని అల్‌-హయ్యా వ్యాఖ్యానించారు. గాజాలో వినాశనానికి దారితీసినప్పటికీ.. అక్టోబరు 7 నాటి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు. పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు. శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్‌ బలగాల పూర్తిస్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు ద్విదేశ పరిష్కారానికి (Two State Solution) ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నిరాకరిస్తున్నారు. హమాస్‌ను అంతం చేసేవరకు పోరాటం సాగిస్తామని పలుమార్లు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని