Arvind Kejriwal: తిహాడ్‌ జైలు నంబరు 2లో కేజ్రీవాల్‌.. డైలీ రొటీన్‌ ఇదే..!

Arvind Kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు. అక్కడ సీఎం దినచర్య ఎలా ఉండనుంది..?

Published : 01 Apr 2024 18:46 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో రెండు వారాల పాటు ఆయన తిహాడ్‌ జైలులోనే ఉండనున్నారు. భారీ భద్రత నడుమ ఈ సాయంత్రమే ఆయనను జైలుకు తరలించారు. సీఎంకు రెండో నంబరు గదిని కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా ప్రస్తుతం ఇదే జైలులో ఒకటో నంబరు గదిలో ఉన్నారు. ఇక, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌కు ఐదో నంబరు గదిని కేటాయించారు. మరో ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌ ఏడో నంబరు సెల్‌లో ఉన్నారు.

జైల్లో కేజ్రీవాల్‌ దినచర్య ఇలా..

మిగతా ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్‌ డైలీ రొటీన్‌ ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చాయ్‌, కొన్ని బ్రెడ్‌ స్లైసులు ఇవ్వనున్నారు. కాలకృత్యాలు పూర్తయిన తర్వాత కోర్టు విచారణ ఉంటే తీసుకెళ్తారు. లేదంటే సీఎం తన న్యాయబృందంతో సమావేశమయ్యేందుకు అనుమతి ఉంది.

ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య భోజనం ఇవ్వనున్నారు. పప్పు, కూర, అన్నం, ఐదు రొట్టెలు ఆహారంగా ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఎం తన గదిలోనే ఉండాలి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక కప్పు చాయ్‌, రెండు బిస్కట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లతో సమావేశం అవ్వొచ్చు. సాయంత్రం 5.30 గంటలకే డిన్నర్‌ ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకల్లా మళ్లీ సెల్‌కు పంపిస్తారు.

సదుపాయాలు ఎలాగంటే..?

కేజ్రీవాల్‌కు టీవీ చూసే సదుపాయం ఉంది. 18 నుంచి 20 ఛానళ్ల వరకు చూసేందుకు అనుమతించారు. 24/7 వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయన డయాబెటీస్‌తో బాధపడుతున్నందున రెగ్యులర్‌ చెకప్‌లు చేయనున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక డైట్‌ ఇవ్వాలని ఆయన లాయర్లు అభ్యర్థించారు. ఇక, కేజ్రీవాల్‌ వారానికి రెండుసార్లు తన కుటుంబసభ్యులతో మాట్లాడొచ్చు.

జైల్లో తనకు రామాయణం, భగవద్గీత, ‘హౌ ప్రైమ్‌మినిస్టర్స్‌ డిసైడ్‌’ అనే పుస్తకాలను అనుమతించాలని కేజ్రీవాల్‌ కోర్టును అభ్యర్థించారు. టేబుల్‌, కుర్చీ, మెడిసిన్స్‌ కూడా అనుమతించాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిందా లేదా అనేది స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని