Arvind Kejriwal: సునీత వీడియో సందేశంలో.. కేజ్రీవాల్ ఫొటో వైరల్‌

సునీత నేడు తన భర్త, దిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) పంపిన సందేశం వినిపించారు. ఈ సందర్భంగా వీడియోలో కనిపించిన ఓ ఫొటో విమర్శలకు దారితీస్తోంది. 

Published : 04 Apr 2024 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఎమ్మెల్యేలంతా దిల్లీ ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలని ఆప్‌ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కోరారు. జైలు నుంచి ప్రజాప్రతినిధులకు పంపిన ఈ వినతిని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ఆమె మాట్లాడుతున్న సమయంలో వెనక గోడపై ఉన్న ఓ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

జైలుకు వెళ్లిన దగ్గరినుంచి కేజ్రీవాల్‌ తన మాటలను సునీత ద్వారా వినిపిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన సందేశాల్లో ఆమె వెనక ఉన్న గోడపై అంబేడ్కర్, భగత్‌ సింగ్ ఫొటోలు దర్శనమిచ్చేవి. తాజాగా వాటి మధ్యలో జైలు ఊచల వెనక ఉన్న కేజ్రీవాల్ ఫొటో కనిపించింది. ఇది ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. దానిపై భాజపా దిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తోటి ఖైదీలకు దూరంగా, పుస్తకాలు చదువుతూ.. తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌ దినచర్య!

‘‘అవినీతిపరుడైన కేజ్రీవాల్ ఫొటోను వారిద్దరి మధ్య పెట్టడం విచారకరం. గతంలో కెమెరా ముందు కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పేవారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. తన సతీమణి ద్వారా అబద్ధాలు చెప్పిస్తున్నారు’’ అని పోస్టు పెట్టారు. ఇలాంటి ఎత్తుల ద్వారా ప్రజలు మోసపోరన్నారు. ఇది అవమానకరమని, క్షమించరాని చర్య అని మరో నేత కపిల్‌ మిశ్రా మండిపడ్డారు.

ఇదిలాఉంటే.. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తిహాడ్‌ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. ఈడీ కస్టడీలో వలే కేజ్రీవాల్‌ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆప్‌ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేయాల్సివస్తే.. సునీత సీఎం పదవి చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని