Kejriwal: కేజ్రీవాల్‌కు ఎలక్ట్రిక్‌ కెటిల్‌, టేబుల్‌, కుర్చీ ఇవ్వండి.. జైలు అధికారులకు కోర్టు ఆదేశం

దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయనకు అవసరమైన కొన్ని వసతులు కల్పించాలని తిహాడ్‌ జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది.

Published : 03 Apr 2024 22:26 IST

దిల్లీ: తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు అవసరమైన కొన్ని వసతులు కల్పించాలని జైలు అధికారులను దిల్లీ కోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలోఉంచుకొని ఎలక్ట్రిక్‌ కెటిల్‌తో పాటు పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా ఒక టేబుల్‌, కుర్చీని ఏర్పాటుచేయాలని సూచించింది.  మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఈనెల 15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆయన్ను తిహాడ్‌ జైలుకు తరలించారు. 

కేజ్రీవాల్‌ ఆరోగ్యం దృష్ట్యా  జైలులో నీటిని వేడి చేసుకొనేందుకు, టీ తాగడానికి ఎలక్ట్రిక్‌ కెటెల్‌ అవసరమని ఆయన తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థన మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా తాజా ఆదేశాలు జారీ చేశారు.  ఏప్రిల్ 1న సీఎంను జైలుకు తరలించినప్పుడు ఆయనకు కుర్చీ, టేబుల్‌ అందించాలని జడ్జి ఆదేశించలేదని న్యాయవాది తెలిపారు.  దీనిపై జడ్జి స్పందిస్తూ.. నిందితుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఎలక్ట్రిక్‌ కెటిల్‌ అందించాలనే అభ్యర్థనను అనుమతిస్తామన్నారు. అనుమతించిన పుస్తకాలను చదివేందుకు దరఖాస్తుదారుకు టేబుల్‌, కుర్చీ అవసరమని చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నాకే జైలు మాన్యువల్‌ ప్రకారం నిందితులకు కుర్చీ, టేబుల్‌ అందించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. జైలు మాన్యువల్‌ కాపీని కూడా కేజ్రీవాల్‌కు అందించేందుకు ఆథరైజ్డ్‌ న్యాయవాదిని అనుమతించాలని సూచించారు. మరోవైపు, కేజ్రీవాల్‌ భారీగా బరువు తగ్గారని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై తిహాడ్‌ జైలు అధికారులు స్పందించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయలేదని, పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. బుధవారం ఉదయం సీఎం తన గదిని చీపురుతో స్వయంగా శుభ్రం చేసుకున్నట్లు కనిపించారని సంబంధిత వర్గాలు సమాచారం అందినట్లుగా పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని