Brij Bhushan Singh: బ్రిజ్‌ భూషణ్‌కు షాక్‌.. అభియోగాలు నమోదు

తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషినని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలున్నాయని భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్ (Brij Bhushan) వెల్లడించారు. 

Published : 21 May 2024 20:01 IST

దిల్లీ: మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసులో భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan)పై దిల్లీ కోర్టు అధికారికంగా అభియోగాలు మోపింది. అతడు మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు వెల్లడించారు. తాను నిర్దోషినని చెప్పారు.

బ్రిజ్‌ భూషణ్‌ నేరాన్ని ఏమైనా అంగీకరించారా? అని కోర్టు అడగ్గా.. ‘‘తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు నేరాన్ని ఎందుకు అంగీకరించాలి’’ అని అతడి తరఫు న్యాయవాది వెల్లడించారు. అలాగే తనపై వచ్చిన అభియోగాలన్నింటినీ భాజపా ఎంపీ తోసిపుచ్చారు. తాను విదేశాల్లో క్రీడాకారిణులతో ఒకే హోటల్‌లో బస చేయలేదని చెప్పారు. అతడి మాజీ కార్యదర్శి వినోద్‌ తోమర్‌పైనా అభియోగాలు నమోదయ్యాయి. ‘‘అవన్నీ తప్పుడు ఆరోపణలు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేనెవరినీ ఇంటికి పిలవలేదు. ఎవరినీ తిట్టలేదు, బెదిరించలేదు’’ అని తోమర్ వెల్లడించారు. కోర్టులో వాదనల అనంతరం బ్రిజ్‌ భూషణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. ‘‘ప్రస్తుతానికి నాపై అభియోగాలు నమోదయ్యాయి. వారు వాటిని నిరూపించాల్సి ఉంది’’ అని అన్నారు.

రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా తదితర అగ్రశ్రేణి రెజ్లర్లు నిరుడు ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతణ్ని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో దిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో నేరపూరిత బెదిరింపు కింద అభియోగాలు నమోదయ్యాయి.

యూపీలోని కైసర్‌గంజ్‌ నుంచి అతడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతడికి టికెట్ నిరాకరించింది. అయితే అదే సమయంలో అతడి కుమారుడిని బరిలో దింపడం గమనార్హం. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తున్న బ్రిజ్‌ భూషణ్‌కు యువతలో పాపులారిటీ ఉంది. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాల్లో  బ్రిజ్‌భూషణ్‌ హవా కనపడుతుంది. అందుకే భాజపా ఇతడి విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు