Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

Eenadu icon
By National News Team Published : 04 Oct 2023 12:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

 

దిల్లీ: భూ కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ అధినేత, బిహార్‌ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav)కు దిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి రబ్రీదేవి (Rabri Devi), ఆయన కుమారుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav), కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతీ (Misa Bharti)లకు కూడా బెయిల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై ఆయనతోపాటు మరో 15 మందిపై గతేడాది మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబరులో తొలి ఛార్జీషీట్‌ను దాఖలు చేయగా, ఈ ఏడాది జులై 3న మరో ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది. ఈ ఏడాది సెప్టెంబరు 22న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ దిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. బుధవారం లాలూ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ గీతాంజలి గోయల్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.  దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది వారాలకే ఈ కేసు నమోదవడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని