Manish Sisodia: మద్యం కుంభకోణంలో సిసోదియాకు ఏడు రోజుల ఈడీ కస్టడీ

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi excise scam case) కేసులో సిసోదియాకు ఇప్పుడప్పుడే ఊరట లభించేలా కన్పించట్లేదు. ఈ కేసులో ఆయనను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Updated : 10 Mar 2023 17:37 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi excise scam case)లో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)ది ప్రత్యక్ష పాత్రే అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) శుక్రవారం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ప్రస్తుతం సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ బెయిల్‌ పిటిషన్‌పై నేడు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తన వాదనలు వినిపించింది. సిసోదియాను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం ఆయన్ను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.

‘‘నిపుణుల కమిటీ అభిప్రాయాలను పక్కనబెట్టి.. కొందరికి ప్రయోజనం చేకూర్చేలా నూతన మద్యం విధానాన్ని (Liquor Policy) రూపొందించారు. కొందరు హోల్‌సేల్‌ డీలర్లకు 12శాతం లాభం ఉండేలా పాలసీని తయారుచేశారు. సిసోదియా (Manish Sisodia) ఆదేశాలతోనే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి. ఈ మద్యం విధానంలోని కొన్ని అంశాలను మంత్రుల బృందం సమావేశంలో కనీసం చర్చించలేదు. అయినప్పటికీ పాలసీని ఆమోదించి అమల్లోకి తెచ్చారు. అలా వచ్చిన అక్రమ సొమ్మును హవాలా ఛానళ్ల ద్వారా దారి మళ్లించారు. ఈ మనీలాండరింగ్‌ (Money Laundering)లో సిసోదియా కూడా ఓ భాగమే’’ అని కోర్టుకు ఈడీ వివరించింది. ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారం సిసోదియా ఫోన్‌ అని.. అయితే దాన్ని ఆయన ధ్వంసం చేశారని ఈడీ (ED) న్యాయస్థానానికి తెలిపింది. ఆయన విచారణకు సహకరించలేదని ఆరోపించిన ఈడీ.. 10 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరింది.

అరెస్టు చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది..

అయితే ఈడీ (ED) కస్టడీ అభ్యర్థనను సిసోదియా (Manish Sisodia) తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయడం తమ హక్కుగా భావిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘ఈ మద్యం విధానాన్ని (Delhi excise Policy) లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా ఆమోదించారు. ఒక పాలసీని పలు దశల్లో పరిశీలించడం ఓ ఎగ్జిక్యూటివ్‌ బాధ్యత. మనీలాండరింగ్‌ కేసులో విధానాల రూపకల్పనపై ఎందుకు ఆరా తీస్తున్నారు? సిసోదియా వద్ద ఒక్క అక్రమ పైసాను కూడా ఈడీ గుర్తించలేదు. కేవలం చెప్పుడు మాటల ఆధారంగానే ఆయనపై కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్‌ ఓ క్రూరమైన చట్టంగా మారుతోంది. కేవలం ఆయనను జైల్లో ఉంచడానికే ఈ అరెస్టుకు పాల్పడ్డారు. ఈ మధ్య దర్యాప్తు సంస్థలు అరెస్టులను తమ హక్కుగా భావించడం ఫ్యాషన్‌ అయిపోయింది. ఇలాంటి అరెస్టుల పట్ల కోర్టులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ సిసోదియా తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సిసోదియాకు కస్టడీకి అప్పగించాలన్న ఈడీ అభ్యర్థనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.  ఆయనను ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరోవైపు సీబీఐ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీపై తిహాడ్‌ జైల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని