Manish Sisodia: సిసోదియాకు లభించని ఊరట.. కస్టడీ పొడగింపు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియా (Manish Sisodia) కస్టడీ నేటితో ముగియడంతో ఆయనను కోర్టు ఎదుట హాజరుపర్చారు. అయితే ఈ కేసులో ఆయనకు ఊరట లభించలేదు. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది.

Updated : 04 Mar 2023 16:53 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (excise scam) కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు దిల్లీ (Delhi) కోర్టులో ఊరట లభించలేదు. ఆయనకు విధించిన కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడగించింది..  మరోవైపు బెయిల్‌ కోసం ఆయన చేసిన పిటిషన్‌పై విచారణను బెయిల్‌ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం 10వ తేదీకి వాయిదా వేసింది.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా  గత ఆదివారం సీబీఐ (CBI) అధికారులు సిసోదియా (Manish Sisodia)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో న్యాయస్థానం విధించిన 5 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు శనివారం ఆయనను కోర్టు ఎదుట హాజరుపర్చారు. సిసోదియా విచారణకు సహకరించడం లేదని, ఆయనను మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ (CBI) అధికారులు కోరారు.

అయితే సీబీఐ వాదనను సిసోదియా తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తమకు కావాల్సింది చెప్పించుకునేందుకే కస్టడీని పొడగిస్తున్నారని అన్నారు. కేసు విచారణకు ఆయన సహకరిస్తున్నారని, అయినా సీబీఐ (CBI) చెప్పిన మాటే పదే పదే చెబుతోందని దుయ్యబట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సిసోదియా (Manish Sisodia) కస్టడీని మరో రెండు రోజులు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం వరకు ఆయన సీబీఐ రిమాండ్‌లోనే ఉండనున్నారు.

‘బెయిల్‌పై విచారణ వాయిదా..

మరోవైపు, ఈ కేసు (Excise Scam)లో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ.. సిసోదియా (Manish Sisodia) నిన్న రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఆమె పక్కన ఉండాల్సిన అవసరం దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు.. ఈ బెయిల్‌ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ సీబీఐ (CBI)కి నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.

సిసోదియాకు కోర్టులో హాజరుపర్చిన నేపథ్యంలో రౌస్‌ అవెన్యూ కోర్టు ఎదుట ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతాసిబ్బంది మోహరించారు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని