‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్‌ కామర్స్‌ సంస్థపై యూజర్‌ ఫైర్‌

దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్‌కు ఎక్స్‌పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్‌ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు.

Published : 21 May 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో సరకులు ఆర్డర్‌ చేసినప్పుడు గడువు తేదీకి దగ్గరగా ఉండేవి వస్తువులు కొన్నిసార్లు వస్తుంటాయి. దీనిపై ఫిర్యాదు చేసేవారు కొందరైతే.. ఇంకా కొద్ది రోజులు ఉంది కదా అని పూర్తి చేసేద్దామని సర్దుకుపోయే వారు మరికొందరు. దిల్లీకి చెందిన ఓ వ్యక్తికి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. పోనీలే సర్దుకుపోదామనుకున్నా ఎదురుగా 10 కేజీల గోధుమ పిండి ప్యాకెట్‌. దీంతో ఆ క్విక్‌ కామర్స్‌ సంస్థతో ఆన్‌లైన్‌లో చిన్నపాటి యుద్ధమే నడిపాడు.  ఓ దశలో కంపెనీ వ్యవస్థాపకులకే ఆ పిండిని పంపాలనుకున్నాడు.

దిల్లీకి చెందిన గజేంద్రయాదవ్‌ ఇటీవల జెప్టో క్విక్‌ కామర్స్‌లో సరకులు ఆర్డర్‌ పెట్టాడు. అందులో 10 కేజీల గోధుమ పిండి ప్యాకెట్‌ ఉంది. దాని గడువు తేదీ మరో 8 రోజుల్లో ముగుస్తుందని రాసుంది. దీంతో 10 కేజీల పిండిని 7 రోజుల్లో ఎలా పూర్తి చేయాలని ప్రశ్నిస్తూ ఎక్స్‌ వేదికగా జెప్టోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు.  దీనిపై స్పందించిన ఆ సంస్థ ప్రతినిధి ఒకరు కాల్‌ చేశారు. అవతలి నుంచి ఓ యువతి చేసేదేమీ లేదంటూ సమాధానం ఇచ్చింది. ఆ సమాధానానికి గజేంద్ర యాదవ్‌కు మరింత చిర్రెత్తుకొచ్చింది. వారి మధ్య జరిగిన సంభాషణనూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు.

ఈసారి జెప్టో వ్యవస్థాపకులైన అదితి పలిచా, కైవల్య ఓహ్రాను ట్యాగ్‌ చేశాడు. ‘కస్టమర్లతో ఇలానేనా వ్యవహరించేది’ అంటూ మండిపడ్డాడు. అంతేకాదు ‘గోధుమ పిండిని వేస్ట్ చేయాలనుకోవడం లేదు. మీ ఆఫీస్‌ అడ్రస్ పంపండి. పంపించేస్తా’ అంటూ రాసుకొచ్చాడు. కాసేపటి తర్వాత అడ్రస్‌లు దొరికాయని, చెరో 3 కేజీల చొప్పున పంపిస్తున్నట్లు మరో అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో జెప్టో దిగొచ్చింది. యాదవ్‌కు రిఫండ్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని యాదవ్‌ మరో పోస్ట్‌లో తెలిపాడు. ‘బహుశా వ్యవస్థాపకులకు ఈ పోస్ట్ చేరి ఉంటుంది. అందుకే రిఫండ్‌ జారీ చేశారు’ అంటూ రాసుకొచ్చాడు. వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు కొందరు నెటిజన్లు స్పందించారు. ‘నువ్వు తగ్గొద్దు బ్రో.. ఎలాగైనా సరే ఆ పిండిని పంపాల్సిందే’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు