Social Media: ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్‌.. రూ.36,000 ఫైన్‌, అరెస్ట్‌

Social Media: సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్న యువత ఒక్కోసారి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా దిల్లీలో ఆకతాయిలు చేసిన పనికి పోలీసులు రూ.36,000 జరిమానా విధించారు.

Published : 31 Mar 2024 10:52 IST

దిల్లీ: సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం కొంత మంది చేస్తున్న హడావుడి శృతి మించుతోంది. ఒక్కోసారి అవి వారి ప్రాణాల మీదకూ తెస్తున్నాయి. మరికొన్నిసార్లు సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా దిల్లీలో ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి పోలీసులే బాధితులుగా మారాల్సిన దుస్థితి. రద్దీగా ఉన్న వంతెనపై రీల్స్‌ కోసం కారు ఆపడమే కాకుండా.. తప్పుబట్టిన పోలీసులపైనే చేయి చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రదీప్‌ ఢాకా అనే వ్యక్తి అతడి స్నేహితుడితో కలిసి పశ్చిమ్‌ విహార్‌లోని ఓ ఫ్లైఓవర్‌పై కారులో ప్రయాణిస్తున్నారు. మధ్యలో ఒకచోట ఆపి రీల్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అంతటితో ఆగకుండా కారు డోర్‌ తెరిచి ప్రయాణించారు. దీన్ని గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు వాళ్లని ఆపి నిలదీశారు. నిబంధనల ప్రకారం రూ.36,000 జరిమానా విధించారు.

దీంతో ఆగ్రహించిన ఆ ఆకతాయిలు పోలీసులపై చేయి చేసుకున్నారు. బ్యారికేడ్లకు నిప్పంటించారు. పైగా తామేదో ఘనకార్యం వెలగబెట్టినట్లు దీన్నంతా షూట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారులో ప్లాస్టిక్‌తో తయారు చేసిన కొన్ని నకిలీ ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. కారు ప్రదీప్‌ తల్లి పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ అతడు దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని