Atishi: పరువునష్టం కేసులో ఆప్‌ నేత ఆతిశీకి సమన్లు

పరువు నష్టం కేసులో ఆప్‌ నేత ఆతిశీకి దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. 

Published : 28 May 2024 16:52 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత, దిల్లీ మంత్రి ఆతిశీ (Atishi)కి  దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. భాజపా మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ (Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా ఈ సమన్లు ఇచ్చింది. జూన్ 29న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.

భాజపా, ఆప్‌ నాయకులకు డబ్బు ఎరవేసి వారిని కొనడానికి ప్రయత్నించిందని ఆతిశీ ఆరోపించడంతో ప్రవీణ్ శంకర్ ఏప్రిల్‌ 30న కోర్టులో ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అందులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పేరునూ చేర్చారు. దరఖాస్తులో ముఖ్యమంత్రి చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను ఉదహరించారు. దీనిలో తమ ఎమ్మెల్యేలను భాజపాలో చేరాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు సంప్రదించారని, పార్టీ మారితే రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారని దిల్లీ సీఎం అన్నారు. ఆప్ చేస్తున్న ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని  ప్రవీణ్‌శంకర్‌ పేర్కొన్నారు. మంత్రి  చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భాజపాకు క్షమాపణలు చెప్పాలని తన పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆతిశీని నిందితురాలిగా గుర్తించి జూన్ 29న హాజరుకావాలని ఆదేశించింది.

ఆమ్‌ఆద్మీ పార్టీని అంతం చేయడానికి భాజపా ప్రయత్నిస్తోందని దిల్లీ మంత్రి ఆతిశీ గతంలో ఆరోపించారు. నెల రోజుల వ్యవధిలో భాజపాలో చేరాలని.. లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా భాజపా తనను సంప్రదించిందని అన్నారు. ఆప్‌లోని మరికొందరు నేతలను సైతం కొనడానికి భాజపా ప్రయత్నించిందన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినట్లే  తనను, సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దాలను అరెస్టు చేయించడానికి కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని