Brij Bhushan Singh: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్ భూషణ్‌ ఇంటికి దిల్లీ పోలీసులు

రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దిల్లీ పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. దానిలో భాగంగా మంగళవారం భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్(Brij Bhushan Sharan Singh) ఇంటికి వెళ్లారు.

Updated : 06 Jun 2023 12:00 IST

లఖ్‌నవూ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న(sexual harassment) భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్‌(Brij Bhushan Sharan Singh) ఇంటికి మంగళవారం దిల్లీ పోలీసులు చేరుకున్నారు. విచారణ నిమిత్తం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా(Uttar Pradeshs Gonda)లోని ఆయన ఇంటివద్దకు వెళ్లారని సమాచారం. దానిలో భాగంగా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి 12 మంది వాంగ్మూలం రికార్డు చేశారు. అంతేగాకుండా బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారులను కొందరిని ప్రశ్నించారు. ఇందులో భాగంగా ఎంపీని ప్రశ్నించారో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకూ 137 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు సంబంధిత వర్గాల వెల్లడించాయి.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేసిన బ్రిజ్‌భూషణ్‌(ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా విధులను నుంచి తప్పించారు)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు కొద్దినెలలుగా దిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. దానిలో భాగంగా ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్‌, మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ ఏప్రిల్‌ 28న దాఖలైంది. మైనర్ వేసిన కేసు నిరూపితమైతే పోక్సో చట్టం కింద ఆయనకు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అయితే మైనర్‌ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దానిపై దిల్లీ పోలీసుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు.

ఈ క్రమంలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌  రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. రెజ్లర్ల(wrestlers) బృందం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన రెండురోజుల్లోనే ఈ విషయం బయటకు రావడం గమనార్హం. మరోవైపు రెజ్లర్లు ఆందోళన విరమించారని జరుగుతున్న  ప్రచారంపై రెజ్లర్‌ సాక్షిమాలిక్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేము వెనక్కి తగ్గలేదు. సత్యాగ్రహంతో పాటే రైల్వేలో నా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’ అని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని