Kamal Nath: నా నోటితో నేను చెప్పానా...? భాజపాలో చేరికపై కమల్‌ నాథ్‌ స్పందనిదే

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్‌ నాథ్‌ భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలకు ఆయన తెర దించారు.

Updated : 27 Feb 2024 17:58 IST

చింద్వారా, మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ (Kamal Nath) భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలకు తెర దించారు. నేను నా నోటితో చెప్పడం మీరు విన్నారా?, మీ దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా అని మీడియాను ప్రశ్నించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో కాషాయ పార్టీలో చేరుతున్నారని వస్తున్న వార్తల గురించి మీడియా ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు. నేను పార్టీ మారడంపై అనవసర వదంతులు సృష్టిస్తున్నారు. నేను మీలో ఎవరికైనా చెప్పానా? మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. తర్వాత నన్ను ప్రశ్నించండి అని మండిపడ్డారు. కాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలో ఐదు రోజుల పాటు కాంగ్రెస్‌ నేతలు పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో వర్షాలు, వడగళ్ల వానల కారణంగా రైతులకు జరిగిన నష్టంపై కమల్‌నాథ్‌ స్పందిస్తూ.. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేస్తామన్నారు. భాజపా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం రుణాలతో నడుస్తోందని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన గురించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని