Republic Day: కాగితపు జెండాల్ని ఇష్టానుసారం పడేయొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

జాతీయ జెండా గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈవెంట్లలో వాడే కాగితపు జెండాలను గౌరవప్రదంగా డిస్పోజ్‌ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Updated : 23 Jan 2024 15:03 IST

దిల్లీ: భారత గణతంత్ర వేడుకల (Republic Day Celebrations) వేళ  జాతీయ జెండాల వినియోగానికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రముఖ జాతీయ దినోత్సవాలు, సాంస్కృతిక, క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో వినియోగించే కాగితపు జెండాలను ఈవెంట్లు పూర్తయ్యాక నేలపై ఇష్టానుసారం విసిరేయడం వంటి చర్యల్ని నిరోధించాలని కోరింది. వాటిని గౌరవ ప్రదంగా డిస్పోజ్‌ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. త్రివర్ణపతాకం దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొంది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరింది.

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పార్ట్-II పేరా 2.2లోని క్లాజ్ (X) ప్రకారం.. జాతీయ, సాంస్కృతిక, క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో కాగితంతో తయారుచేసిన జాతీయ పతాకాలను ఈవెంట్‌ పూర్తయ్యాక నేలపై పడేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. మువ్వన్నెల పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా వాటిని డిస్పోజ్‌ చేసేలా చూడాలని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది.

‘ఆ రోజుల్లో నాకు ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే..’ సభలో మోదీ కన్నీటిపర్యంతం

మరోవైపు, ఈ ఏడాది జనవరి 26న భారత్‌ 75వ రిపబ్లిక్‌ డే వేడుకలను నిర్వహించుకుంటోంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.  ఈ ఏడాది దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించనున్న వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. తొలిసారిగా సరిహద్దు భద్రతా దళం( BSF) మహిళా సైనిక బృందం కవాతు చేయనుంది.  మొత్తం 144 మంది బీఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుళ్లకు అసిస్టెంట్‌ కమాండెంట్‌ ర్యాంక్‌ అధికారిణి నేతృత్వం వహిస్తారు.  గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఇప్పటికే దేశ రాజధానిలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు