Bengaluru: మాజీ సీఎం బొమ్మైని కలిసిన డీకేఎస్‌.. ఎందుకంటే..?

Brand Bengaluru ‘బ్రాండ్‌ బెంగళూరు’ను విస్తరించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ భాజపా నేత, మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మైతో భేటీ అయ్యారు.

Published : 23 Jun 2023 22:23 IST

బెంగళూరు: భాజపా సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై(BS Bommai)తో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DKS) శుక్రవారం సమావేశమయ్యారు. బెంగళూరు(Bengaluru)లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాండ్‌ బెంగళూరు(Brand Bengaluru)ను నిర్మించాలనే లక్ష్యంలో భాగంగానే బొమ్మైని కలిసినట్టు ట్వీట్‌ చేశారు. ‘‘మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మైని కలిశాను. ఆయన ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించా. గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన బొమ్మై నుంచి కొన్ని సూచనలు తీసుకున్నా’’ అని డీకేఎస్‌ పేర్కొన్నారు. 

బెంగళూరు అభివృద్ధి గురించి చర్చించేందుకు కొందరు సీనియర్‌ నేతల ఇళ్లకు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్న డీకేఎస్‌.. మాజీ సీఎం, భాజపా నేత బసవరాజ్‌ బొమ్మై సమయం కోరానని.. అయితే, ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయినట్టు ఇటీవల వెల్లడించారు. తాజాగా ఆయన్ను కలిసి బెంగళూరు అభివృద్ధి గురించి చర్చించి సలహాలు తీసుకోవడం విశేషం. బెంగళూరు నగరాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌.. బ్రాండ్‌ బెంగళూరు కోసం ప్రజల నుంచి సూచనలు కోరుతూ ఇటీవల ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. బెంగళూరు పౌరులతో పాటు విదేశాల్లోని కన్నడిగులు నగర అభివృద్ధి కోసం తమ అభిప్రాయాలు తెలపాలంటూ డీకేఎస్‌ బుధవారం  విజ్ఞప్తి చేశారు. జూన్‌ 30 లోపు www.brandbengaluru.karnataka.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. మరోవైపు, బెంగళూరు అభివృద్ధే లక్ష్యంగా శనివారం డీకే శివకుమార్ పలు రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక, ఐటీ, బయోటెక్నాలజీ, విద్య, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలకు చెందిన 42మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆర్నెళ్లలో బెంగళూరు సమగ్రాభివృద్ధికి ఓ బ్లూప్రింట్‌ సిద్ధం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని