DMK: ప్రకటనల్లో చైనా జెండా.. వివాదంలో డీఎంకే

డీఎంకే(DMK) నేత ఒకరు ఇచ్చిన ఓ ప్రకటన వివాదాస్పదమైంది. దానిపై భాజపా(BJP) విమర్శలు గుప్పిస్తోంది. 

Published : 28 Feb 2024 17:44 IST

చెన్నై: తమిళనాడు(Tamil Nadu) మంత్రి ఇచ్చిన ఒక ప్రకటన డీఎంకే-భాజపా(DMK-BJP)ల మధ్య విమర్శలకు దారితీసింది. దానిలో ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు చైనా జెండా రంగులతో ఉన్న స్పేస్‌ రాకెట్‌ దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది.

బుధవారం ప్రధాని మోదీ(Modi) తూత్తుకుడి జిల్లాలోని కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్‌ ప్యాడ్‌(ISRO rocket launch site)కు శంకుస్థాపన చేశారు. దీనికి ముందు ఈ శంకుస్థాపనపై తమిళనాడు మంత్రి తిరు అనితా రాధాకృష్ణన్‌ స్థానిక వార్తా సంస్థలకు ఒక యాడ్ ఇచ్చారు. అందులో మోదీ, స్టాలిన్, ఇతర డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయజెండాతో ఉన్న రాకెట్‌ కూడా కనిపించింది. దీనిపై తమిళనాడు భాజపా చీఫ్‌ అన్నామలై సుదీర్ఘ పోస్టుతో డీఎంకేపై విరుచుకుపడ్డారు. ‘‘ఈ యాడ్ చైనాపై డీఎంకేకు ఉన్న నిబద్ధత, దేశ సార్వభౌమత్వ విస్మరణను తెలియజేస్తోంది. అవినీతిలో కొట్టుమిట్టాడుతోన్న ఈ పార్టీ.. గతంలో చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు తహతహలాడుతోంది.’’

‘‘సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఇప్పుడు తమిళనాడులో కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఉందో వారికి ఈసందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాం. ఆ లాంచ్‌ ప్యాడ్‌ గురించి అనుకున్నప్పుడు మొదటి ఛాయిస్‌ తమిళనాడు. అప్పటి ముఖ్యమంత్రి తిరు అన్నాదురై అనారోగ్య కారణంతో ఆ సమావేశానికి రాలేకపోయారు. ఆ స్థానంలో మథియాళగన్‌ రాక కోసం ఇస్రో అధికారులు ఎంతగానో వేచిచూడాల్సి వచ్చింది.  ఆయన మద్యం తాగి వచ్చి గందరగోళంగా వ్యవహరించారు. 60 ఏళ్ల క్రితం మన అంతరిక్ష కార్యక్రమానికి నాటి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అది’’ అని అన్నామలై మండిపడ్డారు. ఈ యాడ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని కొందరు నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

చిన్నపాటి శాటిలైట్‌ వాహక నౌకలను అంతరిక్షంలోకి పంపేందుకు గత ఏడాది కేంద్రం కొత్త లాంచింగ్ ప్యాడ్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి చిన్న శాటిలైట్లను  లాంచ్‌ చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అందుకే 2000 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని