మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్‌ ఘోష్‌, సుప్రియాకు ఈసీ వార్నింగ్‌

Dilip Ghosh-Supriya Shrinate: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్‌ ఇచ్చింది.

Published : 01 Apr 2024 15:17 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌ (Dilip Ghosh), కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌ (Supriya Shrinate) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి వారి వ్యాఖ్యలను నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించింది.

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలకు గానూ దిలీప్‌ ఘోష్‌, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు గానూ సుప్రియా శ్రీనేత్‌కు ఇటీవల ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీనిపై ఈ నేతలు వివరణ ఇచ్చారు. వాటిని పరిశీలించిన ఈసీ.. వీరిద్దరికీ వార్నింగ్‌ ఇచ్చింది.

‘‘వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వీరిద్దరూ దిగజారి మాట్లాడినట్లు స్పష్టమైంది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే. బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇకపై ఎన్నికల ప్రచారానికి సంబంధించి వారు చేసే ప్రసంగాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాం’’ అని ఈసీ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలకు గానూ వార్నింగ్‌ నోటీసులు వారి సంబంధిత పార్టీల అధినేతలకు కూడా పంపించాం. తమ నేతలు బహిరంగ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా పార్టీలు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి నటి కంగనా రనౌత్‌ను భాజపా నిలబెట్టిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా తన సోషల్‌మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. ఆ పోస్ట్‌ తాను చేయలేదని వెల్లడించారు.

మరోవైపు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరుస్తూ భాజపా ఎంపీ దిలీప్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై వివరణ ఇవ్వాలని భాజపా కోరడంతో ఆయన దీదీకి క్షమాపణలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని