Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మార్చి 28వరకు ఈడీ కస్టడీ

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈ నెల 28వరకు ఈడీ కస్టడీకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది.

Updated : 22 Mar 2024 21:52 IST

దిల్లీ: దిల్లీ మద్యం విధానం కేసు(Delhi Liquor scam)లో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను దిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 28 వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగించింది. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో భారీ భద్రత మధ్య దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. ఈ అంశంపై రెండున్నర గంటల పాటు వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ అంశంపై తాజాగా తీర్పును వెలువరించారు. మార్చి 28న మధ్యాహ్నం 2గంటలకు కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు, కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ మను సింఘ్వి సహా పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. ‘‘మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్‌. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు ‘సౌత్ గ్రూప్’ సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయి’’ అని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవని సీఎం తరఫు న్యాయవాదులు వాదించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని