Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్‌.. నిందితుల జాబితాలో ఆప్‌ పేరు

Arvind Kejriwal: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితుల జాబితాలో ఆమ్‌ఆద్మీ పార్టీ పేరును చేర్చింది.

Published : 17 May 2024 19:43 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ (ED Chargesheet) దాఖలు చేసింది. ఇందులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party )ని నిందితులుగా పేర్కొంది.

మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case)పై ఈడీ దాఖలు చేసిన ఎనిమిదో ఛార్జ్‌షీట్ ఇది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపడం ఇదే తొలిసారి. మార్చి 21న ఆయనను అరెస్టు చేయగా.. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 18 మందిని ఈడీ అరెస్టు చేసింది.

మధ్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, కింగ్‌పిన్‌ కేజ్రీవాల్‌ అని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘‘నూతన మద్యం విధానం రూపకల్పనలో సీఎం (Delhi CM) కీలక పాత్ర పోషించారు. ఈ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ. 100 కోట్ల ముడుపులను ఆమ్‌ ఆద్మీ పార్టీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించింది. ఆ సమయంలో కేజ్రీవాల్‌ బస చేసిన ఓ ఏడు నక్షత్రాల హోటల్ బిల్లులను ఈ కేసుకు సంబంధించిన నిందితుడు చెల్లించినట్లు మా వద్ద సాక్ష్యాలున్నాయి’’ అని ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎస్‌.వి.రాజు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌, ఆప్‌పై ఈడీ తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. త్వరలోనే పార్టీకి చెందిన కొన్ని ఆస్తులను అటాచ్‌ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అరెస్టు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఇదిలాఉండగా.. తన అరెస్టు, జ్యుడీషియల్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లొచ్చని సీఎంకు సూచించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌కు ఇటీవల సుప్రీం జూన్‌ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసిన సంగతి తెలిసిందే. జూన్‌ 2వ తేదీన ఆయన తిరిగి జైలుకు వెళ్లాలని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని