Farooq Abdullah: మనీలాండరింగ్‌ కేసులో ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌సీపీ నేత, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. 

Updated : 11 Jan 2024 02:09 IST

దిల్లీ: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ మఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా(Farooq Abdullah)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) తాజాగా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(JKCA)కు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో విచారించేందుకు ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్‌లోని తమ కార్యాలయానికి నేడు (గురువారం) రావాల్సిందిగా ఆయనకు సమాచారం ఇచ్చింది. ఇదే కేసులో గతంలోనూ ఫరూక్‌ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. భూ కుంభకోణంలో ఇటీవలే ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు, మద్యం కుంభకోణం కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

2004 నుంచి 2009 వరకు జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(JKCA)కు సంబంధించిన నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మనీలాండరింగ్‌ అంశం కావడంతో సీబీఐ ఛార్జిషీట్‌ ఆధారంగా ఈడీ సైతం విచారణ చేపట్టింది. క్రికెట్‌ అసోసియేషన్‌లోని కొందరు ఆఫీస్‌ బేరర్‌లతో పాటు ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. జేకేసీఏ బ్యాంకు ఖాతాల్లోంచి నగదు విత్‌డ్రా అయినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో 2022లో ఫరూక్‌పై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది.  

శ్రీనగర్‌ లోక్‌సభ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 86 ఏళ్ల ఫరూక్‌ అబ్దుల్లా ఆ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు 2001 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ స్పాన్సర్‌గా ఉన్న ఈ అసోసియేషన్‌లో నిధులు పక్కదారి పట్టేలా నియమకాలు జరిగాయని ఈడీ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని