NEET-UG row: నీట్‌ గ్రేస్‌ మార్కుల సమీక్షకు కమిటీ: ఎన్టీఏ డీజీ వెల్లడి

వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ - యూజీ పరీక్ష - 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొంది.

Published : 09 Jun 2024 07:04 IST

దిల్లీ, చండీగఢ్‌: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ - యూజీ పరీక్ష - 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఈ ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం శనివారం నిర్ణయించింది. ఈ కమిటీ వారం రోజుల్లో సిఫార్సులతో నివేదిక ఇస్తుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) డీజీ సుబోధ్‌కుమార్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని.. ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందన్నారు. గ్రేస్‌ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న సుబోధ్‌కుమార్‌ సింగ్‌.. ఆ అభ్యర్థుల ఫలితాల్ని సమీక్షించడం ప్రవేశాల ప్రక్రియపైనా ఏ ప్రభావమూ చూపదన్నారు. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఖండించారు. పేపర్‌ లీక్‌ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్‌ మార్కులే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. కమిటీ సిఫార్సులనుబట్టి నిర్ణయం ఉంటుందన్నారు. 


సుప్రీం పర్యవేక్షణలో సిట్‌ వేయాలి

-ఆప్‌

నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు సిట్‌ ఏర్పాటుచేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శనివారం డిమాండ్‌ చేసింది. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆప్‌ నేత జాస్మిన్‌ షా మీడియా సమావేశంలో తెలిపారు. నీట్‌ అక్రమాలపై కోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సైతం డిమాండ్‌ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో పరీక్షలు అక్రమ వ్యాపారంగా మారాయని ‘ఎక్స్‌’ ద్వారా ఆయన ధ్వజమెత్తారు. విద్యార్థుల కలలను భగ్నం చేస్తూ వారి భవిష్యత్తుతో మోదీ సర్కారు ఆటలాడుతోందని హరియాణా నుంచి తాజాగా లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీలు దీపేందర్‌ హుడా, కుమారి సెల్జా విమర్శించారు. ఈ అక్రమాలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. 


నీట్‌ పరీక్ష రద్దు చేయాలని మహారాష్ట్ర సర్కారు డిమాండ్‌

ముంబయి: నీట్‌ పరీక్ష ఫలితాల్లో తమ రాష్ట్రంలోని చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగినందున.. ఆ పరీక్షను తక్షణం రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రి హసన్‌ ముష్రిఫ్‌ దీనిపై మాట్లాడుతూ.. ‘‘నీట్‌ పరీక్షలు డబ్బు తీసుకున్న తర్వాతే నిర్వహించి ఉండవచ్చు. ఫలితాల తీరు చూస్తే.. మహారాష్ట్రకు చెందిన ఏ విద్యార్థికీ ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశం దొరకదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మా మీద ఒత్తిడి వస్తోంది. ఈ మేరకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదు చేయబోతున్నాం. ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా మా ప్రభుత్వం ఉంది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని