Mahayuti: మహాయుతిలో ముసలం..? ఏక్‌నాథ్‌ శిందే ఏమన్నారంటే!

Eenadu icon
By National News Team Published : 19 Feb 2025 00:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముంబయి: మహారాష్ట్ర అధికార కూటమి ‘మహాయుతి’లో విభేదాలు కొనసాగుతున్నాయంటూ ఇటీవల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలపై ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే స్పందించారు. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ఎటువంటి తగాదాలు లేవన్నారు. తమది మహావికాస్‌ అఘాడీ లేదా విపక్ష ఇండీ కూటమి కాదని, అందుకే ఎటువంటి కోల్డ్‌ వార్‌ (Cold War) ఉండదన్నారు. మహారాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వారితోనే తమ పోరాటమని వ్యాఖ్యానించారు.

‘‘మా మధ్య ఎటువంటి కోల్డ్‌వార్‌ లేదు. అభివృద్ధిని వ్యతిరేకించే వారిపై ఐకమత్యంగా పోరాటం చేస్తాం. నేను సీఎంగా ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌ ఓ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తమ ప్రాంత ప్రజల కోసం దాని మాదిరిగానే ఓ కేంద్రాన్ని పునరుద్ధరించాం’’ అని సచివాలయంలో ఏర్పాటు చేసిన ఓ మెడికల్‌ సెల్‌ గురించి ఏక్‌నాథ్‌ శిందే పేర్కొన్నారు.

తాజా వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూడా స్పందించారు. సచివాలయంలో ఏక్‌నాథ్‌ శిందే ఓ వైద్య సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటువంటి సెల్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఉన్నప్పటికీ ఏక్‌నాథ్‌ శిందే ప్రత్యేకంగా ఓ వైద్య సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తాజాగా వివాదాస్పదమైంది. అంతకుముందు శివసేనకు చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలకు ‘వై’ సెక్యూరిటీ తొలగించడం చర్చనీయాంశమైంది. ఈ భద్రతను తొలగించిన వారి జాబితాలో భాజపా, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శివసేనకు చెందిన వారే అధికంగా ఉండటం ఆ వర్గం నుంచి వ్యతిరేకతకు కారణమైనట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు