EC: తొలి 5 దశల్లో 50.72 కోట్లమంది ఓటేశారు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 50.72 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది.

Published : 26 May 2024 06:38 IST

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లోక్‌సభ నియోజకవర్గాల వారీగా శనివారం విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 50.72 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. బూత్‌ల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని వెబ్‌సైట్‌లో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన మరుసటి రోజే ఈసీ తాజా గణాంకాలు వెల్లడించడం విశేషం. ఈ విధానాన్ని మరింతగా విస్తరిస్తామని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. పోలింగ్‌ గణాంకాల వెల్లడిలో ఎలాంటి ఆలస్యం లేదని పేర్కొంది. ‘‘పోలింగ్‌ సమాచారం అన్నివేళలా యాప్‌లో అందుబాటులో ఉంటుంది. గణాంకాల వెల్లడిలో ఎలాంటి ఆలస్యం ఉండదని కమిషన్‌ స్పష్టంచేస్తోంది’’ అని వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో మొత్తం 96.88 కోట్ల ఓటర్లు ఉన్న సంగతి తెలిసిందే. 

సందేహాలు సృష్టించడమే కొందరి పని

ఎలాంటి తప్పునకు అవకాశమివ్వని బలమైన వ్యవస్థలు ఎన్నికల సంఘంలో ఉన్నాయని, అయినప్పటికీ కొందరు వ్యక్తులు సందేహాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని సీఈసీ రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ గణాంకాలపై వస్తున్న సందేహాలపై శనివారమిక్కడ ఆయన స్పందించారు. ‘‘సందేహాలు సృష్టించడమే కొందరి పని. మన వ్యవస్థ బలమైనది. ఇది ఈ రోజుది కాదు.. 70 సంవత్సరాలకు పైగా ఉంది’’ అని తెలిపారు. ‘‘అయినప్పటికీ ఇలాంటి సందేహాలు ఎలా ఉద్భవిస్తున్నాయి. వాటిని ఎలా సృష్టిస్తున్నారు. ఇవి మన ఓటింగ్, ఎన్నికల వాతావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మన శక్తి మొత్తం ఎలా దారి తప్పుతోంది. ఈ విషయాలన్నింటినీ మేం ఏదో ఒక రోజు కచ్చితంగా దేశానికి తెలియజేస్తాం’’ అని రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు.


అతిత్వరలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ: సీఈసీ

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అతిత్వరలో ప్రారంభిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ శనివారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్‌ శాతం ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు స్థానిక ప్రభుత్వాన్ని కలిగి ఉండడానికి అర్హులని వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలు ముఖ్యంగా యువత, మహిళలు ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇది నా చెవులకు శ్రావ్యంగా ఉంది. ప్రజాస్వామ్య మూలాలు బలోపేతం అవుతున్నాయి. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు’’ అని తెలిపారు. ‘‘ఈ పోత్సాహంతోనే అతి అతిత్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభిస్తాం. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు స్థానిక ప్రభుత్వాన్ని కలిగి ఉండడానికి అర్హులు’’ అని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని