Electoral bonds: ఎన్నికల బాండ్ల పథకం అతిపెద్ద కుంభకోణం : కాంగ్రెస్‌

ఎన్నికల సంఘం బయటపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల (Electoral Bonds) వివరాలు.. భాజపా అనుసరిస్తోన్న అవినీతి వ్యూహాలను బహిర్గతం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. స్వతంత్ర భారతంలో ఇది అతిపెద్ద కుంభకోణమని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అప్పటివరకు భాజపాకు చెందిన బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని పేర్కొంది.

Published : 15 Mar 2024 16:54 IST

దిల్లీ: ఎన్నికల సంఘం బయటపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల (Electoral Bonds) వివరాలు.. భాజపా అనుసరిస్తోన్న అవినీతి వ్యూహాలను బహిర్గతం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. స్వతంత్ర భారతంలో ఇది అతిపెద్ద కుంభకోణమని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేసింది. అప్పటివరకు కాషాయ పార్టీకి (BJP) చెందిన బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) స్పందిస్తూ.. ఎన్నికల బాండ్ల ముసుగులో చోటుచేసుకున్న అవినీతి కార్యకలాపాలపై న్యాయస్థానం నియమించిన అధికారులతో విచారణ జరిపించాలన్నారు.

భాజపా ఖాతాలను నిలిపివేయాలి..

‘అవినీతికి పాల్పడం, పాల్పడనివ్వం.. అని ప్రధాని చెబుతారు. కానీ, ఎన్నికల బాండ్ల పేరుతో భాజపా నిధులను ఎలా సేకరిస్తోందనే విషయం సుప్రీంకోర్టు బయటపెట్టింది. భాజపా 50శాతం విరాళాలు పొందగా, కాంగ్రెస్‌కు 11శాతం వచ్చినట్లు ఎస్‌బీఐ ఇచ్చిన సమాచారంతో వెల్లడైంది. బడా వ్యాపారవేత్తలు అంత మొత్తంలో ఆ పార్టీకి నిధులు ఎలా సమకూర్చారు? విరాళాలు ఇచ్చిన వారిలో ఎక్కువగా ఈడీ, ఐటీల దాడులను ఎదుర్కొన్నవారే’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పేర్కొన్నారు. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికలకు తాము ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల పేరుతో భాజపా రూ.కోట్లు సేకరించిందని, వారికి రూ.6000 కోట్లు విరాళంగా రావడం అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. వీటిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అప్పటివరకు భాజపా బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలన్నారు.

అతిపెద్ద కుంభకోణం..

‘స్వతంత్ర భారతంలో ఇది అతిపెద్ద కుంభకోణం. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం మాకు ఉంది.. ప్రజా కోర్టుకు వెళ్తాం’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈవీఎంలకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదన్నారు. వీవీప్యాట్‌ల స్లిప్పుల అంశంపై తమ విజ్ఞప్తిని తెలియజేసేందుకు ఏడాదిగా  ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతున్నా అటునుంచి స్పందన లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఎన్నికల సంఘం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

అదో ‘క్విడ్‌ ప్రో కో’..

ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైన పథకమని, పరస్పరం లబ్ధి చేకూర్చే మూలాలు (quid pro quo) ఇందులో స్పష్టంగా ఉన్నాయని కపిల్‌ సిబల్‌ ఆరోపించారు. బాండు ఐడీ నంబర్లను వెల్లడించాలని, తద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే విషయంపై విచారణ జరపాలన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపై దర్యాప్తు జరపాల్సి ఉందని, కానీ, ఈడీ ప్రస్తుతం నిద్రాణస్థితిలో ఉన్నందున వెంటనే జరగకపోవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ఇందులో మోసాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని కపిల్‌ సిబల్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని