Kedarnath: సాంకేతికలోపంతో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్‌.. పరుగులు తీసిన ప్రయాణికులు

కేదార్‌నాథ్ కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. పైలట్‌ చాకచక్యం వల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Updated : 24 May 2024 15:09 IST

కేదార్‌నాథ్: పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర (Char Dham Yatra) లో ఒకటైన కేదార్‌నాథ్‌ (Kedarnath)కు బయల్దేరిన యాత్రికులకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌ (helicopter)లో సాంకేతిక లోపం తలెత్తి గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, పైలట్‌ అప్రమత్తత వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

కేస్ట్రల్‌ ఏవియేషన్‌కు చెందిన హెలీకాప్టర్‌ సిస్రీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరింది. అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలిప్యాడ్‌కు సుమారు 100 మీటర్ల దూరంలో  గడ్డి నేలపై ల్యాండ్‌ అయ్యింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడినుంచి పరుగులు తీశారు.  ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా ఉన్నారు. 

‘‘ సిస్రీ నుంచి కేదార్‌నాథ్ ధామ్‌కు ఆరుగురు ప్రయాణికులతో వస్తున్న హెలికాప్టర్‌ను కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సివచ్చింది. సాంకేతిక సమస్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది” అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.

గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లతో కూడిన చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. హిందువులకు ఈ యాత్ర ఎంతో పవిత్రమైనది. సాధారణంగా చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్-మే నుంచి అక్టోబర్-నవంబర్ వరకు జరుగుతుంది. ఇది యమునోత్రి నుంచి మొదలై, గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా సాగి, చివరకు బద్రీనాథ్‌లో ముగుస్తుంది. ఈ యేడాది యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని