యూపీ మాజీ ఎమ్మెల్యేల ఘనత..యాభై ఏళ్ల వయసులో 12వ తరగతిలో ఉత్తీర్ణత

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్‌ మిశ్రా (భాజపా), ప్రభుదయాల్‌ వాల్మీకి (ఎస్పీ) యాభై ఏళ్ల వయసులో 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.

Updated : 26 Apr 2023 20:59 IST

లఖ్‌నవూ: చదువుకు వయసుతో సంబంధం ఏముంది? ఆసక్తి, అవకాశం ఉండాలే కానీ, ఏ వయసులోనైనా చదువుకోవచ్చని నిరూపించారు ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్‌ మిశ్రా, ప్రభుదయాళ్‌ వాల్మీకి.. యాభై ఏళ్లు పైబడినా వయసు గురించి ఆలోచించకుండా చదువు మీద మమకారంతో ఇటీవల 12వ తరగతి బోర్డు పరీక్షలు రాశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో వారిద్దరూ ఉత్తీర్ణత సాధించారు. 

భాజపా (BJP) నేత రాజేశ్‌ మిశ్రా (55).. బరేలీ (Bareilly) జిల్లాలోని బిఠారీ చైన్‌పుర్‌ నియోజక వర్గానికి 2017 నుంచి 2022 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూనే చదువుపై ఆసక్తితో పదోతరగతి పూర్తి చేశారు. ‘‘చదువుపై ఇష్టంతో రెండేళ్ల క్రితం 10వ తరగతి పూర్తి చేశాను. ప్రస్తుతం 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాను. కానీ, 263 మార్కులే వచ్చాయి. ఇంకా మంచి మార్కులు సాధించాల్సింది. తర్వాత డిగ్రీ చేయాలనుకుంటున్నాను. ఎల్‌ఎల్‌బీ చదివి లాయర్‌ కావాలన్నది నా ఆశయం. ఆర్థిక పరిస్థితుల వల్ల పేద ప్రజలు న్యాయపరమైన అంశాలలో మంచి లాయర్లను వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో వారు తగిన న్యాయాన్ని పొందలేకపోతున్నారు. నేను న్యాయవాదిగా మారి పేదలకు సేవలందిస్తాను’’ అని రాజేశ్‌ మిశ్రా తెలిపారు. 
 
సమాజ్‌ వాద్‌ (SP) పార్టీ నేత ప్రభుదయాళ్‌ వాల్మీకి (59) మీరట్‌లోని హస్తినాపుర్‌ (Hastinapur) నియోజకవర్గం నుంచి రెండు సార్లు (2002, 2017) ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఫలితాలతో ఆయన సెకండ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన ఆయన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తనకు ఆదర్శమని తెలిపారు. చదువుకు వయసుకు సంబంధం లేదని డిగ్రీ కూడా చదువుతానని తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని