పాక్‌కు రహస్యాలు చేరవేసిన కేసు.. బ్రహ్మోస్‌ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు

గూఢచర్యం కేసులో బ్రహ్మోస్‌ సంస్థకు చెందిన మాజీ ఇంజినీర్‌కు నాగ్‌పుర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

Updated : 03 Jun 2024 17:03 IST

నాగ్‌పుర్‌: పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు రహస్యాలు చేరవేసిన కేసులో బహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ (BrahMos Aerospace Pvt Ltd) మాజీ ఇంజినీర్ నిశాంత్ అగర్వాల్‌కు జీవితఖైదు పడింది. అధికారిక రహస్యాల చట్టం కింద నాగ్‌పుర్ జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. దీనికింద అతడు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే కోర్టు రూ.3వేల జరిమానా విధించింది. 

నాగ్‌పుర్‌లోని బ్రహ్మోస్‌ సంస్థకు చెందిన మిస్సైల్ కేంద్రంలోని టెక్నికల్ రిసెర్చ్ సెక్షన్‌లో నిశాంత్ విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో సంస్థకు చెందిన అత్యంత కీలకమైన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్‌ఐకు లీక్‌ చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. 2018లో ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటిలిజెన్స్‌, ఉగ్రవాద నిరోధక బృందాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టయ్యాడు. తర్వాత పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం తాజాగా నాగ్‌పుర్ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. డీఆర్‌డీఓ, రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్‌ కన్షార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్‌ సంస్థను నిర్వహిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని