Violation case: మాజీ ఎంపీ సహా పది మందికి జైలు శిక్ష

మాజీ ఎంపీ రామ్‌ బక్ష్‌ వర్మ సహా పది మందికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. 2017లో  ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Published : 23 Jun 2023 17:44 IST

కన్నౌజ్‌: యూపీలో మాజీ ఎంపీ రామ్‌ బక్ష్‌ వర్మ సహా పది మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో ఎన్నికల  ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన(model code of conduct violation ) కేసులో ఒక్కొక్కరికీ ఏడాది జైలు శిక్షతో పాటు రూ.3వేలు చొప్పున జరిమానా విధిస్తూ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ధర్మవీర్‌ సింగ్‌ తీర్పు వెలువరించారు.  జైలు శిక్ష పడిన వారిలో మాజీ ఎంపీ తనయుడు సైతం ఉన్నారు.

మాజీ ఎంపీ రామ్‌ బక్ష్‌ వర్మ గతంలో  రెండు పర్యాయాలు (1994, 2006) రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 1977లో జనతా పార్టీ నుంచి, 1989లో జనతాదళ్‌ నుంచి ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. 2017లో నిర్వహించిన ఊరేగింపులో వర్మ మద్దతుదారులు పోలీసులతో గొడపడటంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వర్మ, మరికొందరిపై 2017 జనవరి 25న తిర్వా పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  ఈ కేసులో వర్మ సహా పది మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. వర్మ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని