Devendra Fadnavis: దిల్లీలో ఫడణవీస్‌.. కనిపించని శిందే

Eenadu icon
By National News Team Published : 12 Dec 2024 11:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటికీ ఎన్నో చర్చల తర్వాత మహారాష్ట్ర (Maharashtra)లో ఎన్డీయే కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయినా మంత్రి పదవుల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. మంత్రివర్గ కూర్పుపై కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) దిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌ (Ajit Pawar) కూడా అక్కడే మకాం వేశారు. కానీ శివసేన అధినేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) జాడ మాత్రం కానరాలేదు.

ప్రస్తుతం దేశ రాజధానిలోని ఫడణవీస్‌ (Devendra Fadnavis) నిన్న రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. సీఎం పదవిని వదులుకొని డిప్యూటీ సీఎంగా కొనసాగడానికి అంగీకరించినప్పటికీ శిందే ఇంకా శాంతించలేదని ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇదిలాఉంటే, కూటమి పార్టీలు గెలిచిన స్థానాల ప్రకారం.. భాజపా నుంచి 20 మంది, శివసేన నుంచి 12 మంది, ఎన్సీపీ నుంచి 10 మంది మంత్రులుగా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే సీఎం ఎవరనే అంశంపై కూటమి నేతల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. భాజపా సీనియర్‌ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌కే ఆ బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు అందరూ ఊహించారు. అందుకుతగ్గట్టుగానే భాజపా కోర్‌ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా.. అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

మరోవైపు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన శిందే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు శిందే అంగీకరించడంతో ఆ ఊహాగానాలకు చెక్‌ పడింది. దాంతో గతవారం ఫడణవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలో ‘మహా’ ప్రభుత్వం ఏర్పడింది. తాను అడిగితేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు శిందే అంగీకరించారని ఇటీవల సీఎం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖను అప్పగించాలని శిందే డిమాండ్‌ చేశారని శివసేన ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యలు చేశారు. ఆ పదవి ఇచ్చేందుకు భాజపా సుముఖంగా లేదని వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో మంత్రివర్గ కూర్పులో శిందేకు ఏ పదవి దక్కుతుందో తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు