Farmers Protest: మార్చి 6న దిల్లీకి రండి.. 10న ‘రైల్‌ రోకో’: రైతు నేతల పిలుపు

పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు డిమాండ్ల కోసం రైతు సంఘాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.

Published : 03 Mar 2024 20:43 IST

దిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని (Farmers Protest) మరింత ఉద్ధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా మార్చి 6న దిల్లీలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని, మార్చి 10న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు రైతు సంఘాల నేతలు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌, జగ్జీత్‌ సింగ్‌ డాల్లేవాల్‌ ఇటీవల ఘర్షణలో మృతిచెందిన రైతు స్వగ్రామం బల్లోహ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న నిరసన కేంద్రాల వద్ద రైతుల ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని.. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నేతలిద్దరూ స్పష్టం చేశారు.

ప్రస్తుతం శంభు, ఖానౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద జరుగుతున్న ఆందోళనకు పంజాబ్, హరియాణా రైతులు మద్దతు కొనసాగిస్తుండగా.. మార్చి 6న ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు కూలీలు రాజధాని దిల్లీకి చేరుకొని నిరసనలో పాల్గొనాలని రైతు సంఘాలు నిర్ణయించాయని కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కేఎంఎం) నేత సర్వన్‌సింగ్‌ పంధేర్‌ అన్నారు. ట్రాక్టర్ ట్రాలీల్లో చేరుకోలేని దూర రాష్ట్రాల రైతులు రైళ్లు, ఇతర రవాణా మార్గాల ద్వారా దిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. శంభు, ఖానౌరి వద్ద ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఈ ఆందోళనను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రెండు ఫోరమ్‌లు మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలో రైల్‌రోకో చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చినట్లు పంధేర్ తెలిపారు. రైతుల డిమాండ్లకు మద్దతుగా అన్ని పంజాబ్ పంచాయతీలు తీర్మానం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్‌ ట్రాలీ సరిహద్దు పాయింట్ల వద్దకు చేరుకుంటుందని తెలిపారు. దిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకొనేందుకు కేంద్రం అన్ని వ్యూహాలు పన్నిందని తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు పంజాబ్‌కే పరిమితమని, కేవలం రెండు ఫోరమ్‌లు మాత్రమే ఈ పోరాటాన్ని నడిపిస్తున్నాయన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పంధేర్‌ అన్నారు. కానీ దేశంలోని 200 కంటే ఎక్కువ రైతు సంఘాలు ఈ రెండు ఫోరమ్‌లలో భాగమేనని స్పష్టం చేస్తున్నామన్నారు. రైతుల సమస్యల్ని పరిష్కరించడం కేంద్రానికి ఇష్టం లేదని ఆరోపించిన ఆయన.. ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. భాజపా సర్కార్‌ అజెండాలో రైతులు, రైతు కూలీలు లేరన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే ఆందోళనలు తగ్గుముఖం పడతాయన్న అభిప్రాయం సరైంది కాదని.. తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.  వ్యవసాయ రంగాన్ని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీవో) పరిధి నుంచి తీసేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడతామని జగ్జీత్‌ సింగ్‌ డాల్లేవాల్‌ అన్నారు. ఈ ఆందోళనలు కేవలం పంజాబ్‌కు మాత్రమే పరిమితమని వాదించేవారు.. హరియాణా సరిహద్దుల్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితిని ఎందుకు విధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగానే తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. మళ్లీ తాజాగా తమను చర్చలకు కేంద్రం పిలవలేదని.. పిలిచిన ప్రతిసారీ కాదనకుండా వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. రైతు శుభకరన్ సింగ్ త్యాగం వృథా కాదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని