Indian Railways: రైల్వే అధికారుల కొట్లాట.. గంటన్నర పాటు నిలిచిపోయిన రైళ్లు!

రైల్వే అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో వందే భారత్‌ సహా పలు రైళ్లు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోయిన ఘటన వారణాసిలో ఇటీవల చోటుచేసుకుంది.

Published : 30 May 2024 21:16 IST

దిల్లీ: స్టేషన్‌ మాస్టర్‌, ఉద్యోగి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.. రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయానికి దారితీసింది. వందేభారత్‌ సహా పలు రైళ్లు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోయాయి. వారణాసి రైల్వే జంక్షన్‌లో ఈ ఘటన ఇటీవల చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు.

వారణాసి జంక్షన్‌లో పని చేస్తున్న ఎలక్ట్రికల్‌ సిగ్నల్‌ నిర్వాహకుడు షెహజాద్‌.. అక్కడి సెక్షన్‌ డిజిటల్‌ యాక్సిల్‌ కౌంటర్‌లోని రీసెట్‌ బాక్స్‌ను తెరిచేందుకు యత్నించాడు. అయితే, సరైన అనుమతి లేకుండా దాన్ని తెరిచేందుకు కుదరదని స్టేషన్‌ మాస్టర్‌ వారించాడు. తొలుత వాగ్వాదంతో మొదలై.. చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది.

Vande Bharat Metro: ‘వందే మెట్రో’.. ఫస్ట్‌ లుక్‌.. విశేషాలివే!

ఈక్రమంలో షెహజాద్‌ తనపై రాయితో దాడి చేశాడని, దీంతో తల, భుజానికి తీవ్ర రక్తస్రావం అయినట్లు స్టేషన్‌ మాస్టర్‌ ఆరోపించారు. కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని, అందుకే రైళ్లను ఆపరేట్‌ చేయడం సాధ్యం కాలేదని ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. సిగ్నల్‌ ఆపరేటర్‌ మాత్రం.. ఆయనే తనతో అమర్యాదగా ప్రవర్తించడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించాడు. దీనిపై ముగ్గురు ఉన్నతాధికారులతో రైల్వేశాఖ దర్యాప్తు జరిపి ఓ నివేదిక రూపొందించింది.

వారణాసి రైల్వేజంక్షన్‌లో మే 28న సాయంత్రం 7.30 గంటల సమయంలో విధులు నిర్వర్తిస్తోన్న స్టేషన్‌మాస్టర్‌, ఎలక్ట్రిక్‌ సిగ్నల్‌ నిర్వాహకుడి మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది. దీంతో ఈ జంక్షన్‌ మీదుగా వెళ్లే అనేక రైళ్లపై ప్రభావం పడింది. పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌, బనారస్‌-బక్సర్‌ మెమూ ప్యాసింజర్‌, ఎర్నాకులం సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, వారణాసి మెమూ ఎక్స్‌ప్రెస్‌, పట్నా కాశీ జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సమీప స్టేషన్లలో నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని