Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్‌ తోటకూర

Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్‌ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఎన్‌ఎస్‌-25 మిషన్‌లో టూరిస్ట్‌గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.

Updated : 12 Apr 2024 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్‌ తోటకూర (Gopichand Thotakura) రికార్డు సృష్టించనున్నారు. ‘బ్లూ ఆరిజిన్‌’ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్‌’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లనున్నారు.  

1984లో రాకేశ్‌ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. భారత తొలి స్పేస్‌ టూరిస్ట్‌గా తాజాగా గోపీచంద్‌ (Gopichand Thotakura) చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నప్పటికీ.. భారత పాస్‌పోర్టు ఉండడం గమనార్హం

మొత్తం ఆరుగురు..

అమెజాన్‌ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్‌. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్‌ మిషన్‌ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్‌ సహా ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే ఎన్‌ఎస్‌-25 మిషన్‌కు గోపీచంద్‌ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్‌ క్యాపిలిస్ట్‌ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్‌ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్‌ షాలర్‌, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్‌ ఎడ్‌ డ్వైట్‌ ఎన్‌ఎస్‌-25లో ప్రయాణించనున్నారు. డ్వైట్‌ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి నల్లజాతి వ్యోమగామి. కానీ, వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసీలోకి వెళ్లే అవకాశం మాత్రం రాలేదు.

మన విజయవాడ కుర్రాడే..

విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ తోటకూర.. ప్రిజర్వ్‌ లైఫ్‌ సంస్థ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. అట్లాంటా శివారులో మిలియన్ల డాలర్లతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఒక వెల్‌నెస్‌ సెంటర్‌. గోపీచంద్‌ పైలట్‌గానూ శిక్షణ పొందారు. పదేళ్ల క్రితం భారత్‌లో మెడికల్‌ ఎయిర్‌-ఎవాక్యుయేషన్‌ సేవల్లో పనిచేశారు. బ్లూ ఆరిజిన్‌ అధికారికంగా ప్రకటించే వరకు తన కుటుంబానికి సైతం ఈ విషయం తెలియదని ఎకనామిక్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ గోపీచంద్‌ వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయసులోనే అంతరిక్షంపై ఆసక్తి కలిగిందని తెలిపారు. ‘ఎంబ్రీ-రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీ’ నుంచి ఏరోనాటికల్‌ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు.

100 కిలోమీటర్ల ఎత్తుకు..

బ్లూ ఆరిజిన్‌ ఇప్పటి వరకు ఆరు మిషన్లలో 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్రమట్టానికి 80-100 కిలోమీటర్ల ఎగువన ఉండే కర్మన్‌ లైన్‌ వరకు వెళ్లి వచ్చారు. మొత్తం 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగుతుంది. ధ్వని వేగానికి మూడు రెట్ల స్పీడ్‌తో ప్రయాణిస్తారు. కర్మన్‌ లైన్‌ను దాటి కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిని అనుభవిస్తారు. అక్కడి నుంచి భూగోళాన్ని వీక్షించి మెల్లగా కిందకు వస్తూ పారాచూట్ల సాయంతో క్యాప్స్యూల్‌లో కిందకి దిగుతారు.

స్పాన్సర్‌షిప్‌తో..

ఎన్‌ఎస్‌-25 మిషన్‌కు సంబంధించిన ఖర్చును వేరేవాళ్లు భరిస్తున్నారు. అది ఎవరు, ఎంత మొత్తం చెల్లిస్తున్నారనేది బ్లూ ఆరిజిన్‌ బహిర్గతం చేయలేదు. రిచర్డ్‌ బ్రాన్‌సన్‌కు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సైతం గతంలో పర్యటక అంతరిక్షయానాలు చేపట్టింది. రోదసీ టూరిస్ట్‌లను ఆకర్షించడంలో ఈ ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి. స్పేస్‌ టూరిజం విలువ 2030 నాటికి మూడు బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లా ఈ జాబితాలో ఉన్నారు.  మన దేశం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని