MLAs Kidnapped: ‘మా ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారు’.. హిమాచల్‌ సీఎం సుఖు ఆరోపణ

తమ పార్టీకి చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలను ‘కిడ్నాప్‌’ చేశారని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సంచలన ఆరోపణలు చేశారు.

Published : 27 Feb 2024 23:41 IST

శిమ్లా: కాంగ్రెస్‌కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలను ‘కిడ్నాప్‌’ చేశారని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu) సంచలన ఆరోపణలు చేశారు. సీఆర్‌పీఎఫ్‌తో పాటు హరియాణా పోలీసులు వారిని తీసుకెళ్లిపోయారని అన్నారు. హిమాచల్‌లో ఒక రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ (Rajya Sabha polls) ముగిసిన కొన్ని గంటల్లోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌.. భాజపా గూండాయిజానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. ప్రతిపక్ష నేత జైరాం ఠాకుర్‌ పదే పదే కౌంటింగ్‌ హాలులోకి వచ్చి అధికారులను బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడితే రాజీనామా చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కాకుంటే.. సుఖు ప్రభుత్వంపై భాజపా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సుఖు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే సమయంలో హరియాణాలోని పంచకులాలోని గెస్ట్‌హౌస్‌ బయట ఓ కాన్వాయ్‌ ఉన్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుధీర్‌ శర్మ, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, కొందరు భాజపా ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, 68 సభ్యులున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు. ప్రతిపక్ష భాజపాకు మాత్రం 25 మంది సభ్యులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని