Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో కొంగతో స్నేహం చేసిన వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పక్షిని ఇటీవలే సంరక్షణ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే.

Published : 27 Mar 2023 01:39 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో ఓ ‘సారస్‌’ కొంగ(Sarus Crane)కు, వ్యక్తికి మధ్య ఏర్పడిన అనుబంధం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. అయితే, అమేఠీకి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌ నుంచి ఆ కొంగను అటవీ శాఖ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకుని, సమస్‌పుర్‌ పక్షుల సంరక్షణ(Samaspur Sanctuary) కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా అతనిపై కేసు నమోదు చేశారు. వాంగ్మూల నమోదుకు అటవీశాఖ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.

ఏడాది క్రితం ఆరిఫ్‌ పొలంలో ఈ కొంగ కనిపించింది. కాలు విరిగిపోయి, రక్తమోడుతూ ఉంది. దీంతో అతను కొంగ గాయం కడిగి.. కట్టు కట్టాడు. కొన్నాళ్లకు కోలుకున్న ఆ పక్షి.. తనను కాపాడిన ఆరిఫ్‌తోనే ఉండిపోయింది. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పక్షి ‘కొంగ’. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు మార్చి 21న ఆ కొంగను స్వాధీనం చేసుకుని రాయ్‌బరేలీలోని సమస్‌పుర్‌ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

తాజాగా వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని ఆయా సెక్షన్ల కింద ఆరిఫ్‌పై కేసు నమోదు చేశారు. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకుగానూ గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. పక్షిని తరలించిన మరుసటి రోజే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అటవీ శాఖ సిబ్బంది తీరుపై విమర్శలు చేశారు. మరోవైపు.. ఆరిఫ్‌ సమ్మతితోనే పక్షిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ పక్షులు ఎప్పుడూ జంటగా జీవిస్తాయని, అది ఒంటరిగా నివసిస్తున్న నేపథ్యంలో దాని మేలుకే సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు