Amritpal Singh: నేను పోలీసులకు లొంగిపోవడం లేదు.. త్వరలోనే ప్రజల ముందుకొస్తా: అమృత్‌పాల్‌ సింగ్‌

పోలీసుల ఎదుట తాను లొంగిపోవడం లేదంటూ ఖలిస్థాన్‌ వేర్పాటువాది, వారిస్‌ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

Published : 31 Mar 2023 00:30 IST

న్యూదిల్లీ: పంజాబ్‌ పోలీసుల నుంచి కొన్నిరోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్‌ వేర్పాటువాది, వారిస్‌ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ తాజాగా మరో వీడియో విడుదల చేశాడు. తాను పోలీసులకు లొంగిపోవడం లేదని పేర్కొన్నాడు. అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసులకు లొంగిపోనున్నట్లు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు గురువారం మరో వీడియో విడుదల చేశాడు. ‘‘నేను పారిపోయానని, అనుచరులను విడిచిపెట్టానని కొందరు అనుకుంటున్నారు. ఆ భ్రమను తొలగించుకోండి. నేను చావుకు భయపడను. నేను దేశం విడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేనొక తిరుగుబాటుదారును. తిరుగుబాటు సమయంలో చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తిరుగుబాటు అనేది కష్ట సమయం. త్వరలోనే ప్రజల ముందుకు వస్తా. నేను ప్రభుత్వానికి భయపడను. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అని అమృత్‌పాల్‌ సింగ్‌ పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలని సూచించాడు. సిక్కుల సమస్యల పరిష్కారం కోసం ‘సర్‌బత్‌ ఖల్సా’ను ఏర్పాటు చేయాలని  అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ను కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అంతకుముందు, పంజాబ్‌ పోలీసుల ముందు లొంగిపోయేందుకు తాను ఎలాంటి డిమాండ్లు పెట్టడంలేదని అమృత్‌ పాల్‌ పేరుతో ఓ ఆడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ తాజా వీడియో విడుదల చేసినట్లు సమాచారం. 

అమృత్‌పాల్‌ ఈ నెల 18న పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అప్పటినుంచి పరారీలో ఉన్న అతడు మారువేషాల్లో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అయితే బుధవారం లొంగిపోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వెలువడినప్పటికీ, అనూహ్యంగా పంజాబ్‌ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పోలీసులకు తనను అరెస్టు చేసే ఉద్దేశం లేదని అందులో ఆరోపించాడు. మరోవైపు పంజాబ్‌ పోలీసులు అమృత్‌పాల్‌ కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. అతడు దేశం వదిలిపారిపోకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని