Mukhtar Ansari: గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్‌

గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. 

Updated : 29 Mar 2024 09:35 IST

యూపీ: గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ (Mukhtar Ansari) (63) గుండెపోటుతో మృతి చెందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన మృతికి సంబంధించి అధికారులు మెడికల్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘‘యూపీ (Uttar Pradesh) లోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో ఆయన చనిపోయారు’’ అని బులెటిన్‌లో పేర్కొన్నారు.

అన్సారీ మృతితో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్‌ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్‌, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్‌ రిజర్వ్‌ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

రెండు రోజుల క్రితం అన్సారీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఆయనకు జైలులో విషపూరిత ఆహారం ఇచ్చారని ఇటీవలే ఆయన సోదరుడు, ఘాజీపుర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. అయితే ముఖ్తార్‌ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరుగుదొడ్డిలో పడిపోయారని జైలు అధికారులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.

అన్సారీపై 61 కేసులు

యూపీలోని మౌకు చెందిన అన్సారీపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్‌ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్‌, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్‌ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్‌ గన్‌ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్‌ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్‌ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్‌(ట్విటర్‌)లో సంతాపం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని