ఈసారి 230 మందిని సస్పెండ్‌ చేస్తారా..?: కాంగ్రెస్ ప్రశ్న

నరేంద్ర మోదీ(Modi) నాయకత్వ శైలితో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లకాలం అధికారంలో ఉంటుందన్న విశ్వాసం లేదని కాంగ్రెస్ నేత గౌరవ్‌ గొగొయ్‌ అన్నారు

Published : 11 Jun 2024 18:05 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపాపై కాంగ్రెస్(Congress) విమర్శలు గుప్పించింది. ఆయన ప్రధానిగా ఉన్నంతకాలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో ఆ పార్టీ తీరు మారదని విమర్శించింది. అయితే విపక్ష ‘ఇండియా’ కూటమికి పెరిగిన బలంతో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండనుందని పేర్కొంది. ఈమేరకు కాంగ్రెస్ నేత గౌరవ్‌ గొగొయ్‌(Gaurav Gogoi) మీడియాతో మాట్లాడారు.

మోదీ నాయకత్వ శైలితో ఈ ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లకాలం అధికారంలో ఉంటుందన్న విశ్వాసం లేదని గౌరవ్‌ అన్నారు. ‘‘వారు బిల్లుల్ని ఏకపక్షంగా ఆమోదించడం వీలుకాని పార్లమెంట్‌ను నేను చూస్తున్నాను. ఇప్పుడు భయపెట్టలేరు. సస్పెండ్‌ చేయలేరు. గత సంవత్సరం వారు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈసారి 230 మందిని సస్పెండ్‌ చేస్తారా..?’’ అని ప్రశ్నించారు. ‘‘మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం పార్లమెంట్‌ ప్రజాస్వామ్యం విషయంలో వారి తీరు మారుతుందని అనుకోవడం లేదు. అయితే ఫుట్‌బాల్ పదజాలంలో చెప్పాలంటే.. ఇప్పుడు డిఫెండర్స్‌ సంఖ్య పెరిగింది. మేం బలంగా మారాం. అలాగే కేంద్రం డీమానిటైజేషన్ గురించి ఆర్థికమంత్రికి తెలియదు. ఆర్టికల్‌ 370 రద్దు గురించి, అగ్నిపథ్‌ గురించి ఆయన క్యాబినెట్‌కు తెలియదు. తన క్యాబినెట్‌ను పరిగణనలోకి తీసుకోని వ్యక్తి.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు. ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలరని నేను అనుకోవడం లేదు’’ అని అన్నారు.

ఇదిలాఉంటే.. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి నుంచి సవాల్‌ ఎదురైనా.. ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి.. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. విపక్ష కూటమికి 230కి పైగా స్థానాలు దక్కాయి. గత రెండుసార్లు భాజపా సొంతంగానే మెజార్టీ సాధించుకుంది. కానీ ఈసారి 240 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు మోదీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. దీనిని ఉద్దేశించే గౌరవ్‌ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని