తెలంగాణ వంటకాల్లో ఘాటు ఎక్కువ

తెలంగాణ వంటకాల్లో కాస్త ఘాటు ఎక్కువ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అంత కారం తాను తినలేనని స్పష్టం చేశారు.

Published : 24 Jan 2023 04:55 IST

అంత కారం నేను తినలేను
బఠాణీ, పనసపండు నచ్చవు
చికెన్‌, మటన్‌, సీఫుడ్‌ తింటా
ఓ సరదా ఇంటర్వ్యూలో రాహుల్‌ గాంధీ

దిల్లీ: తెలంగాణ వంటకాల్లో కాస్త ఘాటు ఎక్కువ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అంత కారం తాను తినలేనని స్పష్టం చేశారు. జోడో యాత్ర రాజస్థాన్‌లో ఉన్న సమయంలో రాహుల్‌.. ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ ఛానల్‌ కర్లీ టేల్స్‌ ప్రతినిధి కామియా జానీకి సరదా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిని కాంగ్రెస్‌ పార్టీ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అందులో ఆహార అలవాట్ల గురించి కామియా అడగ్గా ఆయన స్పందిస్తూ.. ‘‘భోజనం గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తా. కానీ, బఠాణీ, పనసపండు అస్సలు నచ్చవు. యాత్రలో భాగంగా ఎన్నో రాష్ట్రాల వంటకాలు రుచిచూశాను. తెలంగాణవి నాకు కాస్త ఘాటుగా అనిపించాయి. అక్కడ కారం కాస్త ఎక్కువ. అంత కారం నేను తినలేను. నేను మాంసాహారిని. చికెన్‌, మటన్‌, సీఫుడ్‌ అన్నీ తినేస్తా. చికెన్‌ టిక్కా, సీఖ్‌ కబాబ్‌, ఆమ్లెట్‌ నా ఫేవరెట్‌. వీటన్నింటితో పాటు రోజు ఉదయం ఓ కప్పు కాఫీ నోట్లో పడాల్సిందే’’ అని రాహుల్‌ చెప్పారు.

ప్రేమించే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా

సరైన అమ్మాయి దొరికితే తప్పకుండా  పెళ్లి చేసుకుంటానని రాహుల్‌ తెలిపారు. ‘‘పెళ్లికి నేను వ్యతిరేకం కాదు. మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందువల్ల నా అంచనాలు కాస్త పైనే ఉంటాయి. సరైన అమ్మాయి దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటా. ప్రేమించే వ్యక్తి, తెలివైన అమ్మాయి అయితే చాలు’’ అని ఆయన వెల్లడించారు.

తొలి జీతం 3000 పౌండ్లు

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తాను ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చిందని రాహుల్‌ తెలిపారు. ‘‘నానమ్మ (ఇందిరా గాంధీ) చనిపోయిన తర్వాత నన్ను బోర్డింగ్‌ స్కూల్‌ నుంచి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నా. ఉన్నత విద్య కోసం హార్వర్డ్‌కు వెళ్లా. నాన్న హత్య తర్వాత అక్కడి నుంచి నన్ను ఫ్లోరిడాకు పంపించారు. చదువు పూర్తయ్యాక లండన్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేశాను. నా తొలి జీతం 2500-3000 పౌండ్లు’’ అని రాహుల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని